కరోనా భయం వద్దు…జాగ్రత్త తప్పదు

ఇది ఎపుడూ లేనంత పెద్ద జలుబు

తగ్గించేద్దాం!

నవీన్ 2-4-2020

కోవిడ్ 19 / కరోనా వైరస్ వ్యాపిస్తున్న ధోరణిపై న్యూస్ పేపర్లలో టివిలలో వస్తున్న అంకెలు చూసి భయపడనవసరం లేదు. అయితే తప్పకుండా జాగ్రత్త పడాలి

కరోనా అంటే ఏమిటి అది ఎలా వుంటుంది ఎందుకు ఎలా వ్యాపిస్తుంది మొదలైన వివరాలు అర్ధం చేసుకుంటే అపోహలు తొలగిపోతాయి. జరిగేదేదో జరుగుతుంది మనం చేసేదేముంది అనే నిరుత్సాహం తొలగిపోతుంది. భయంతగ్గుతుంది.

కరోనా వైరస్ అంటే యాక్టివిటీ లేని కోమాలో వుండే ఒక కణం. ఇది జిగురు పదార్ధమైన ‘మ్యూకస్’ లోకి చేరితే కదలిక మొదలౌతుంది. మెరుపు వేగంతో కోట్ల కొద్దీ కణాలుగా పునరుత్పత్తి జరుగుతుంది.(ముక్కులో తేమ / చీమిడి, నోట్లో తెమడ/ గల్ల, కంట్లో పుసులు మొదలైనవి మ్యూకసే)

కరోనా శరవేగంగా విస్తరించే మానవ శరీర భాగం లంగ్స్ / ఊపిరితిత్తులు. ఇది లంగ్స్ లో చేరితే దాని వ్యాప్తి విస్తరణల వల్ల శ్వాసనాళాలు మూసుకుపోతాయి. ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచాలు గిడసబారిపోయి ఊపిరి అందదు. అందువల్ల ఆక్సిజన్ నిలచిపోయి మరణం సంభవిస్తుంది. అయితే 100 మందికి కరోనా సోకితే అందులో (రోగనిరోధక శక్తి తక్కువగా వుండే) నలుగురికి మాత్రమే ప్రాణాపాయం వుండవచ్చు

కరోనా కణం మీద వుండే కవచం / పొర ఊడిపోతే ఆ వైరస్ ఏమీ చేయలేదు. డెటర్జంట్ / సబ్బు / నీళ్ళు తగిలితే లేదా శానిటైజర్ తగిలితే

కరోనా కవచం లేదా పైపొర ఊడిపోతుంది. అంతటితో కరోనా నిర్వీర్యమైపోతుంది

నోటికి ముక్కుకు మాస్క్ వేసుకోవాలనడానికి, చేతులు పదేపదే కనీసం 20 సెకెన్లు కడుక్కోవాలనడానికి కారణం ఇదే.

అసలు బయటికే వెళ్లకూడదన్న సోషల్ డిస్టెన్సింగ్ నియమానికి, మనిషికి మనిషికి దూరం పాటించాలన్న ఫిజికల్ డిస్టెన్సింగ్ నియమానికి మూలం ఇదే!

ఇన్ని జాగ్రత్తలు పాటించినా కరోనా వ్యాపిస్తోందంటే అందుకు కారణాలు

1 అందరూ జాగ్రత్తలు పాటించక పోవడం

2 కాస్త సందు దొరికినా దూసుకుపోయి వ్యాపించే కరోనా స్వభావం

అయినా భయపడనవసరం లేదు. ఇందుకు ప్రభుత్వం ప్రకటిస్తున్న అంకెలే సాక్ష్యాలు. కరోనా 100 మందికి వచ్చింది అనుకుందాం! ఇందులో 80 మందిమీద కరోనా ప్రభావం వుండకపోవచ్చు.

14 రోజులతరువాత లేదా ఆలోగా వైరస్ ప్రభావం మొదలౌతుంది. ప్రభావం తీవ్రంగా వుంటే ఆగని తలనొప్పి తగ్గని జ్వరం మొదలౌతాయి. ఇలాంటి వారికే చికిత్సలు అవసరం.

ఆస్పత్రిలో వున్న వారిలో కూడా నూటికి 80 మందికి ట్రీట్ మెంటు అవసరం వుండకపోవచ్చు . వారు ఇతరులకు వైరస్ సోకకుండా ఐసొలేషన్ లో వున్నవారు మాత్రమే.

ఊపిరి అందడం లేదన్న వారిలో నూటికి 16 మందికి ఆక్సిజన్ ఇస్తే వారు రికవరీ అవకాశాలు ఎక్కువ.

ఆక్సిజన్ అందించినా లంగ్స్ పనిచేయని మిగిలిన నలుగురి పరిస్ధితే కాస్త విషమం. వీరిని వెంటిలేటర్ మీద ఉంచుతారు. ఇక్కడ ఊపిరితిత్తులు చేసే పనిని వెంటిలేటర్ చేస్తుంది. ఆ సమయంలో ఊపిరితిత్తుల్లో కదలిక తెచ్చే ప్రయత్నాన్ని డాక్టర్లు ట్రీట్ మెంటు ద్వారా చేస్తారు. అది ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు!

ఇదంతా తెలుసుకున్నపుడు మనం కరోనా మధ్యలో వున్నాకూడా దానికి దూరంగా వున్నమని అర్ధమౌతుంది.

కరోనా మన దగ్గరకు రాకుండా వుండాలంటే—-

1 వీలైనంత వరకూ ఇంట్లోనే వుండి పోవడం

2 కుటుంబీకులను కూడా తాకకుండా వుండటం

3 బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే డెటర్జెంట్ / సబ్బ / శానిటైజర్ తో చేతులు శుభ్రంగా కడుక్కోవడం

4 వీలు చేసుకుని రోజూ వేడివేడి నీళ్ళతో శరీరంలో ప్రతిభాగాన్ని శుభ్రం చేసుకుంటూ తలస్నానం చెయ్యడం బయటకు వెళ్ళి వచ్చేవారు రెండోపూట కూడా వేడినీళ్ళ తల స్నానం చెయ్యడం

ఈ చర్యల ద్వారా మనం కరోనాని దూరంగా వుంచవచ్చు

ముక్కుదిబ్బడ, రొంప, జలుబు, మనకి తెలుసు…ఊపిరి ఆడనివ్వని అతి పెద్ద జలుబుగానే కరోనా వైరస్ ను చూద్దాం!

ఇది ఊపిరితితుల్లో దూరి వాటిని గిడసబరచే ఉపద్రవం రాకుండా ముందునుంచే జాగ్రత్త పడదాం!

గుర్తుంచుకోండి : కరోనా వైరస్ తెచ్చే సమస్యలనుంచి రోగి బయటపడటానికి హాస్పిటల్స్ లో మెడికల్ మేనేజిమెంట్, మెడికల్ ప్రొసీజర్స్ ప్రయత్నాలే తప్ప కరోనాకు మందులేదు. అయినా భయపడనవసరం లేదు. కానీ తప్పకుండా… తప్పకుండా…తప్పకుండా… జాగ్రత్త… జాగ్రత్త… జాగ్రత్త పడవలసిందే!

గమనిక : ఈ వ్యాసం రాసిన పెద్దాడ నవీన్ అనే నేను డాక్టర్ ని కాదు. జర్నలిస్టుని. 28 ఏళ్ళు మెయిన్ స్ట్రీమ్ లో పని చేశాను 11 ఏళ్ళుగా ఫ్రీలాన్సర్ గా వున్నాను. రాజమండ్రి వద్దగల జిఎస్ఎల్ వైద్యవిద్య, వైద్య సంస్ధల్లో నాన్ మెడికల్ ఆర్డినేటర్ గా కూడా పనిచేస్తున్నాను.

కరోనా వైరస్ పై సమాజంలో భయాందోళనలు పెరిగిపోతున్న స్థితిలో ప్రజలకు లోతైన అవగాహన కల్పించడంలో ఒక జర్నలిస్టుగా, కమ్యూనిటీ కమ్యూనికేటర్ గా బాధ్యతతీసుకుని ఈ వ్యాసం రాశాను

ఆధారాలు : జిఎస్ఎల్ సంస్ధల్లో పల్మనాలజి, చెస్ట్ మెడిసిన్ , జనరల్ మెడిసిన్, మైక్రోబయాలజీ, పాధాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, అనస్ధీషియాలజి, క్రిటికల్ కేర్, మెడికల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల ప్రొఫెసర్లు, డాక్టర్ల నిపుణులతో నా ప్రశ్నలు, వారు ఇచ్చిన సమాధానాలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *