ఇల్లు ఇక నెరవేరని కల

(శనివారం నవీనమ్)

ఇల్లు కట్టడం అనేది ఇపుడు నెరవేరని కల…ఇల్లు కొనడం అనేది ఇపుడు పెద్ద నిట్టూర్పు. నోట్లరద్దువల్ల కుదేలైపోయిన గృహ నిర్మాణ రంగం ఆర్థిక వ్యవస్థ మందగమనం వల్ల ఇపుడపుడే కోలుకునేలా లేదు.

ఆర్ధిక వ్యవహారాలను విశ్లేషించే బెంగుళూరు ప్రొఫెసర్ భరత్ ఒక వ్యాసంలో ఘజియాబాద్‌లోని మధ్య తరహా భవన నిర్మాత అనుభవాలను ఉదాహరించారు. 1500 గృహాల సముదాయాన్ని నిర్మించేందుకై రూ.300కోట్లతో భూమిని ఆ బిల్డర్ కొనుగోలు చేశాడు. ఒక్కో ఇంటిని కోటి రూపాయల చొప్పున వెరసి మొత్తం రూ.1500 కోట్లకు ఆ గృహ సముదాయాన్ని విక్రయించేందుకు అతడు తన వ్యాపార ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు.

 తన లక్ష్య పరిపూర్తిలో భాగంగా రూ.1200 కోట్ల విలువైన గృహాలను విక్రయించాడు. ఇది పెద్ద నోట్ల రద్దు సంభవించడానికి ముందు జరిగింది. అలా ఆర్జించిన రూ.1200 కోట్లలో రూ.600 కోట్లను ఆ గృహ సముదాయాన్ని నిర్మించడానికి, మిగతా రూ.600 కోట్లను తన తదుపరి ప్రాజెక్టుకు అవసరమైన భూమి కొనుగోలుకు వినియోగించాలని అతడు నిర్ణయించుకున్నాడు. ఇది రెండు దశాబ్దాలు ఆ బిల్డర్ అనుసరించిన ‘ప్రామాణిక’ వ్యాపార ప్రణాళిక.

పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థను ఒక పెను సంక్షోభం ఆవరించింది. ఘజియాబాద్ బిల్డర్ ప్రాజెక్టు పరిపూర్తికి రూ.900కోట్లు అవసరమవుతాయి. పెద్ద నోట్ల రద్దు జరిగే నాటికి అతడు కేవలం రూ.600కోట్ల మేరకు మాత్రమే వ్యాపారం చేయగలిగాడు. ఇంకా రూ.300 కోట్లు అవసరమవుతాయి. నోట్లరద్దు సంక్షోభంతో మిగతా గృహాలను విక్రయించలేక పోయాడు. ప్రాజెక్టు పరిపూర్తికి నిధుల కొరత ఏర్పడింది.

ఆ గృహ నిర్మాణ ప్రాజెక్టు నిలిచిపోయింది. అలాగే అతని భావి ప్రాజెక్టు కూడా నిలిచిపోవడం అనివార్యమయింది. ధరలు పడిపోవడంతో ఆ బిల్డర్ పాత ప్రాజెక్టు పూర్తిచేయడం, కొత్త ప్రాజెక్టును ప్రారంభించడం అసాధ్యమైపోయింది.

ఈ పరిస్థితుల్లో, గృహ నిర్మాణ రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం సంకల్పించింది. నిర్మాణం నిలిచిపోయిన ప్రాజెక్టులకు రూ.25,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని సమకూర్చడానికి సర్కార్ పూనుకున్నది. అయితే ఈ సహాయక ప్యాకేజీతో గృహ నిర్మాణ రంగ సమస్యలు సమసిపోవు.

ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయంతో ఘజియాబాద్ బిల్డర్ తన ప్రాజెక్టులో అసంపూర్ణంగా నిలిచిపోయిన 300 గృహాల నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు. విక్రయానికి సర్వసన్నద్ధం చేస్తాడు. అయితే ఇప్పటికే మన దేశంలో 13 లక్షల గృహాల యూనిట్లకు కొనుగోలుదారులు ఎవ్వరూ లభించడం లేదని మార్కెట్ విశ్లేషకులు చెప్పుతున్నారు. ప్రభుత్వ సాయం పుణ్యమా అని నిర్మాణాన్ని పూర్తిచేసుకున్న వేలాది కొత్త గృహాలు, అమ్ముడుపోకుండా మిగిలిపోయిన వాటికి అదనంగా చేరతాయి. సమస్య మరింత సంక్లిష్టమవుతుంది.

ఇటువంటి పరిస్థితులను అధిగమించేందుకు చైనా నుంచి మనం తప్పక నేర్చుకోవల్సిన పాఠం ఒకటి వున్నది.

చైనాలో భారీగా పెట్టుబడులు పెట్టిన భారతీయ వ్యాపారి ఒకరు ప్రొఫెసర్ భరత్ కు ఈ ఆసక్తికరమైన వివరాలు చెప్పాడు.

ఒక ఫ్యాక్టరీ ఉన్న భూమిని, హైవే నిర్మాణం నిమిత్తం ఆరు నెలలలోగా ప్రభుత్వానికి అప్పగించాలని ఆ ఫ్యాక్టరీ యజమానికి నోటీసు జారీ అయింది. ఆ తరువాత ప్రభుత్వ అధికారుల బృందం ఒకటి ఆ ఫ్యాక్టరీని సందర్శించింది. ఫ్యాక్టరీని మరో ప్రదేశానికి తరలించేందుకు మీరు ఇచ్చే నష్ట పరిహారానికి అదనంగా 30 శాతం ఖర్చవుతుందని ఆ ఫ్యాక్టరీ యజమాని ఆ అధికారులకు నివేదించాడు. ఆ అధికారులు అక్కడికక్కడే నష్ట పరిహారాన్ని మరో 40 శాతం మేరకు పెంచారు. ఈ నలభై శాతంలో పది శాతాన్ని ముడుపులుగా తీసుకున్నారు. ఇది ప్రతి ఒక్కరి ప్రయోజనాలను నెరవేర్చింది. ఫ్యాక్టరీ యజమానికి అవసరమైన అదనపు నష్ట పరిహారం లభించింది. అధికారులు తమ వాటాను తాము పొందారు. ఉత్పత్తి కార్యకలాపాలు నిరాటంకంగా సాగిపోవడానికి దోహదం జరగడంతో ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి నష్టం సంభవించే పరిస్థితి లేదు.

మళ్ళీ ఘజియాబాద్ బిల్డర్ వద్దకు వద్దాం. స్థిరాస్థుల ధరలు పడిపోవడమనేది ఒక వాస్తవం. బిల్డర్, బ్యాంకులు, కొనుగోలుదారులు అంతో ఇంతో నష్టపోవడం జరిగింది. అయితే ఈ ముగ్గురిలో ప్రతి ఒక్కరూ తాము నష్టపోయిన సొమ్ము తమకు పూర్తిగా రావాలని, ఇందుకయ్యే భారాన్ని మిగతా ఇద్దరూ భరించాలని గట్టిగా ఆశిస్తున్నారు.

ఇది సహజంగానే ఎడతెగని వివాదానికి దారితీసింది. నష్టాన్ని ముగ్గురూ పంచుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవల్సిన అవసరం ఎంతైనా వున్నది.

వివాదాన్ని పరిష్కరించడమెలా? ప్రభుత్వం విధిగా ఒక కమిషన్ ను ఏర్పాటు చేయాలి. బిల్డర్, బ్యాంకర్, కొనుగోలుదారులను సమావేశ పరచాలి. ఆ ముగ్గురిలో ప్రతి ఒక్కరూ ఎంతెంత నష్టాన్ని భరించాలో కమిషన్ అధికారులు నిర్ణయించాలి (ఎలాంటి లంచం తీసుకోకుండా వారు ఈ నిర్ణయాన్ని తీసుకోగలరని ఆశిద్దాం).

ఈ నిర్ణయం అసంపూర్ణంగా నిలిచిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరించవచ్చు.

ఇంత చేసినా గృహ నిర్మాణ రంగం పుంజుకోగలదని ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే నిర్మాణం పూర్తయి అమ్ముడు పోకుండా వున్న గృహాల యూనిట్లు చాలా పెద్ద సంఖ్యలో వున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నిర్మాణాన్ని పూర్తి చేసుకునే గృహ సముదాయాలు వాటికి అదనంగా చేరుతాయి.

గృహ నిర్మాణరంగంలో జోక్యం చేసుకుని ఏవో కొన్ని సర్దుబాట్లు చేయడం ద్వారా ఆ రంగాన్ని వేధిస్తున్న సమస్యలు పరిష్కరించగలగడం ఎంత మాత్రం సాధ్యం కాదు.

మరి మార్గాంతరమేమిటి? గృహాలకు డిమాండ్‌ను ఇతోధికంగా పెంపొం దించవలసిన అవసరం ఎంతైనా వున్నది. ఇటువంటి డిమాండ్‌ను ఉత్పన్నం చేయడమే సమస్యకు అసలైన పరిష్కారమవుతుంది. అసలు గృహ నిర్మాణరంగంలో డిమాండ్ పడిపోవడానికి మూల కారణం భారీ స్థాయి ఉత్పాదక కార్యకలాపాలను పెంపొందించే విధానాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడమేనని చెప్పక తప్పదు. ఉత్పత్తి కార్యకలాపాలను దాదాపుగా ఆటోమెటిక్ యంత్రాలే నిర్వహిస్తుండడంతో ఉత్పత్తి కార్యకలాపాలలో మానవ వనరులకు ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో నిరుద్యోగం ప్రబలి పోతోంది. చిన్న తరహా పరిశ్రమలు మార్కెట్‌లో తమ వాటాను అంతకంతకూ కోల్పోతున్నాయి.

చిన్న తరహా పరిశ్రమలను సంరక్షించడానికి ప్రభుత్వం తక్షణమే పూనుకోవాలి. ఆ రంగం సజావుగా ఉంటే కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగాలు ఉన్నప్పుడు ప్రజలకు ఆదాయాలు సమకూరతాయి గదా. ఆదాయమున్నప్పుడు సొంత ఇళ్ళు సమకూర్చుకోవడానికి వారు తప్పక ప్రయత్నిస్తారు. తద్వారా గృహ నిర్మాణ రంగం, దానితో పాటు ఆర్థిక వ్యవస్థ మొత్తంగా పుంజుకుంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *