తరుముకొస్తున్న డబ్బు కరవు

జగన్ గారూ ఇది ప్రతీకారాల సమయం కాదు!

(శనివారం నవీనమ్)

ఆర్థికాభివృద్ధికి ప్రాథమిక చోదక శక్తి నమ్మకమే కదా? ఇది ఇప్పుడు దేశంలో కొరవడింది. చౌకగా లభించే రుణాలు ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు వాటికవే తమ సొంతంగాఎంత మాత్రం తోడ్పడవు. మన ప్రభుత్వం వినియోగదారులతోను, వ్యాపారస్తులతోను విరివిగా సంప్రదింపులు జరపాలి. వివిధ అంశాలపై వారి సంకోచాలను తొలగించాలి. వినియోగదారుల నుంచి పెరిగే డిమాండ్, వ్యాపారస్తుల నుంచి సమృద్ధంగా సరుకులకు సరఫరా మధ్య సుస్థిరమైన చక్రక్రమాన్ని పునరుద్ధరించేందుకు అది తప్పనిసరి.

జాతీయవాదంలో హిందూత్వాన్ని నింపుతున్న మోదీ పరివారం ప్రయత్నాలు ఓటర్లలో పదేపదే భావోద్వేగాలు నింపడానికీ, ఎన్నికల్లో మళ్ళీ మళ్ళీ గెలవడానికే తప్ప ప్రజల కొనుగోలు శక్తులు పెంచడానికీ, ఆర్ధిక చక్రభ్రమణాన్ని వేగవంతం చేయడానికీ పనికిరావు.

రద్దులు, తొలగింపులే ప్రధాన ఎజెండాగా మార్చుకున్న జగన్ పాలనా విధానాలు పునర్నినిర్మాణ దశల్లో వున్న నవ్యాంధ్రప్రదేశ్ కప కొత్తపరిశ్రమలు, వాణిజ్యం రానీయకుండా మాత్రమే దోహదమౌతాయి. మోదీ, చంద్రబాబు, జగన్ వగైరా నాయకులను – పార్టీలను వ్యతిరేకించేవారి లేదా మద్దతు ఇచ్చేవారి మధ్య నిప్పు రాజేయడానికి మాత్రమే న్యూస్ టివిలు, ఆ అగ్గిని ఆరని మంటగా రాజేయడానికి మాత్రమే సోషల్ మీడియా పనిచేస్తున్నాయి.

తరుముకొస్తున్న ఆర్ధిక మాంద్యం పట్ల ప్రజలకు అవగాహన కలిగించే పనికి పూనుకోకపోవడం మెయిన్ స్ట్రీమ్ మీడియా లో కనబడుతున్న అతిపెద్ద బాధ్యతా రాహిత్యం. నిపుణులతో సంప్రదించని నాయకుల అహంకారపూరిత మూర్ఖత్వాలు పరాకాష్టకు చేరుకుంటున్నాయి.

పాలకుల విధానాలు ఆర్ధిక వ్యవస్ధను బలపరచడమో, బలహీనపరచడమో చేస్తాయి.

ఆ విధానాలకు సంబంధంలేని స్వాభావికమైన, సహజమైన ఆర్ధిక వ్యవస్ధ ప్రజలకు వారివారి ప్రాంతాలను బట్టి వుంటుంది.

డొమెస్టిక్ సేవింగ్స్ / చిన్నమొత్తాల్లో కూడబెట్టిన డబ్బు / పోపుడబ్బాల్లో బ్లాక్ మనీ భారతదేశపు బలం…రిజర్వు బ్యాంకులో బంగారాన్ని తాకట్టు పెట్టుకోవలసిన దరిద్రంలో కూడా ఆ కష్టం ప్రజలమీద పెద్దగా పడలేదంటే మనకున్న డొమెస్టిక్ సేవింగ్స్ దన్నే అందుకు కారణం. చిన్నమొత్తాల పొదుపు ఒక కుషన్ మనీ! మోదీ పెద్ద నోట్లను రద్దు చేశాక ఇబ్బందులు పడినా మనం రోజువారీ జీవనానంలో నిలదొక్కుకుని నిలబడ్డామంటే ఈ కుషనే కారణం!

ఆయితే పెద్దనోట్ల రద్దు ప్రభావం ఇప్పటికీ గట్టిగా వుంది. కోటిమంది కి ఉద్యోగాలు పోయాయి. మన జీడీపీ రూ.19,017,000 కోట్లు. డీమానిటైజేషన్ మూలంగా మనం గత మూడు సంవత్సరాలలో కనీసం 1 శాతం జీడీపీని కోల్పోయామన్నది ఒక అంచనా.

వార్తా సంస్థల నివేదిక ప్రకారం కార్ల అమ్మకాలు ఈ ఏడాది ఏప్రిల్, జూన్ మధ్యలో 23.3 శాతం పడిపోయాయి. 300 మందికి పైగా మోటారు వాహనాల డీలర్లు తమ దుకాణాలను మూసేశారు. వాహనాల రుణాలు తీసుకునే వారి సంఖ్య 5 శాతం కంటే ఎక్కువ పడిపోయింది. ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా 14.8 శాతం పడిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్ల అమ్మకాలు కూడా 14.1 శాతం పడిపోయాయి. ఆటో రంగంలోనే 2లక్షల 30 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని వార్తలు వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ అమ్మకాలు బాగా దెబ్బతిన్నాయి. దేశంలోని 30 పెద్ద నగరాల్లో 10లక్షలకు పైగా ఇళ్లు ఎవరూ కొనకుండా పడి ఉన్నాయి. ఇవి అమ్మడానికి కనీసం మూడున్నరేళ్లు పడుతుందని అంచనా.

నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు రియల్ ఎస్టేట్ రంగం నుంచి ఉపసంహరించుకుంటున్నాయి. రియల్ ఎస్టేట్ దెబ్బతింటే వాటికి అనుబంధంగా ఉన్న ఉక్కు, సిమెంట్, పెయింట్లు, ఫర్నిచర్ వంటి 250 పరిశ్రమల ఉత్పత్తుల అమ్మకాలు కూడా దెబ్బతింటాయి. వాటిపై ఆధారపడ్డ శ్రమజీవులకు పనిలేకుండా పోతుంది. వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువుల అమ్మకం కూడా బాగా పడిపోయింది.

తాము మార్కెట్‌లో విడుదల చేసిన 5 రూపాయల బిస్కట్ ప్యాకెట్లను కూడా జనం కొనడం తగ్గించారని బ్రిటానియా సంస్థ పేర్కొంది. వినియోగదారులు ఖర్చు పెట్టకపోవడం వల్ల టెక్స్‌టైల్ పరిశ్రమ కూడా దెబ్బతిన్నది. పండగ రోజుల్లో కూడా బట్టల దుకాణాల్లో జనం తగ్గిపోతున్నారు. ఇటీవల రిజర్వు బ్యాంకు నిర్వహించిన ఒక సర్వేలో ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింటున్నదనే అభిప్రాయానికి అనేక మంది గృహస్తులు వచ్చారని, అందుకే వారు ఖర్చుపెట్టడాన్ని వాయిదా వేసుకుంటున్నారని తేలింది.

రైళ్లలో బొగ్గు, సిమెంట్, పెట్రోలియం, ఎరువులు, ఇనుప ఖనిజం వంటి రవాణా శాతం తగ్గిపోతోంది. గత ఏడాదితో పోలిస్తే ఉక్కు వినియోగం కూడా తగ్గింది. 2019 ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రకటించిన కొత్త ప్రాజెక్టుల శాతం కూడా 79.5 శాతం తగ్గిపోయింది. పూర్తయిన ప్రాజెక్టుల శాతం కూడా 48 శాతం తగ్గిపోయింది.

నిజానికి పెద్ద నోట్ల రద్దు జరిగిన నాటి నుంచీ దేశంలో పడిపోతున్న ఉపాధి కల్పన, వేతనాల రేట్ల పరిస్థితిలో మెరుగుదల కనిపించడం లేదు. ఆ తర్వాతికాలంలో ఒకేసారి వరుసగా చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, అంతర్జాతీయ పరిస్థితులు కూడా ఆర్థిక వ్యవస్థను మందకొడిగా మార్చేశాయి. 2011–12, 2017-–18 మధ్య లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని తాజా లేబర్ సర్వేలు చెబుతున్నాయి. వ్యవసాయరంగంలోనే అత్యధికులు ముఖ్యంగా మహిళలు ఉపాధి కోల్పోగా ఉత్పాదక రంగంలో కూడా ఉపాధి కల్పన బాగా పడిపోయింది. స్వదేశీ పెట్టుబడులు సరిపోకపోగా, బ్యాంకింగ్ రుణాలు స్తంభించిపోవడం, ఆ తర్వాత నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ కూడా కుప్పకూలిపోవడంతో దేశంలో పరిశ్రమలు కొనసాగలేని పరిస్థితి ఏర్పడింది. రుణాలు పొందగలిగేవారు మన దేశంలో కంటే ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టడం బాగా ఉంటుందనుకునే పరిస్థితి ఏర్పడింది.

దేశమంతా ఆర్ధిక పురోగమనం మందగిస్తూండగా నిర్మాణదశలో వున్న నవ్యాంధ్రప్రదేశ్ పరిస్ధితి మాత్రం వెనక్కి తిరుగుతున్నట్టు వుంది. ప్రభుత్వాధినేతలు తమ రాజకీయ ఎజెండాలను అమలుచేయడానికి అధికారాన్ని ఉపయోగించడం ప్రపంచమంతటా వున్నదే. గత ప్రభుత్వాల నిర్ణయాలను సవరించడమో మార్పులు చేయడమో కూడా సహజమే! జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కూల్చివేతలు, రద్దులు, రీటెండరింగులే ప్రధాన ఎజెండా అయ్యాయి.

నిర్మాణంలో వున్న పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి ఇపుడు పూర్తవుతాయా అనే అనుమానాలు వ్యాపిస్తున్నాయి. ఉపాధులు పెంచి తద్వారా కొనుగోలు శక్తులు పెంచే పారిశ్రామిక, వాణిజ్యరంగాల వికాసానికి శాంతిభద్రతలతో పాటు నమ్మకం ప్రధానమైన సెంటిమెంటు అవుతుంది.

అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వానికి రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితులను అధిగమించే విషయంలో కాని, అభివృద్ధి నిర్మాణాలకు వనరులను సమీకరించుకోవడం మీద గాని దృష్టిలేదని ఆయన చర్యలు చేతల ద్వారా అర్ధమౌతున్నది. పాత ప్రభుత్వం మీద కక్షతీర్చుకోవడం తప్ప ఈ ప్రభుత్వానికి మరో పనే లేదా అన్న ప్రశ్న బాగా వ్యాపిస్తోంది. మరోవైపు నదీ జలాల విషయంగా తెలంగాణ మేలుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కెసిఆర్ కు అప్పగించేస్తున్నారన్న అసహనం కూడా ప్రజల్లో మొదలైంది. ఈ పరిణామాలన్నీ అనిశ్చితికీ, ఆందోళనకూ దారితీయడం వల్ల ఘనమైన మద్దతుతో జగన్ ను గెలిపించిన ప్రజల్లో నాలుగు నెలల్లోనే ముఖ్యమంత్రిపై ప్రజల్లో అతివేగంగా నమ్మకం సడలిపోవడం మొదలైంది.

ఎంత కరువు కాటకాలు వచ్చినా, ఎంతటిఆర్ధిక మాంద్యం మీదపడినా తట్టుకుని నిలబడగలిగిన

“పొదుపుల వెసులుబాటు మనకు వుండేది. మోదీవల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాది, కొనుగోలుశక్తులు ఇచ్చేరంగాలన్నీ చతికిల పడిపోయాయి. జగన్ కక్షలు రద్దుల వల్ల కొత్తపరిశ్రమలు కొత్త నిర్మాణాలు ఇప్పట్లో వచ్చే సూచనలు లేవు…75 శాతం స్ధానికులకే రిజర్వేషన్ల ద్వారా – గిట్టుబాటు వేతనాలను బట్టి, నైపుణ్యాలను బట్టి  మానవ వనరులను ఎంపిక చేసుకునే పరిశ్రమల స్వేచ్ఛను జగన్ ప్రభుత్వం తొలగించడం వల్ల ఇప్పటికే రాష్ట్రం రావడానికి సంసిద్ధతను వ్యక్త పరిశ్రమలు ఆ ఆలోచనను మానుకుంటున్నాయి.

చైనా అమెరికా వాణిజ్య యుద్ధం వల్ల 2020-21 లో అమెరికాలో మాంద్యం తప్పదనీ ఆప్రభావం ప్రపంచమంతా వుంటుందనీ అంచనా వేస్తున్నారు. మరో వైపు మోదీ పెద్దనోట్ల రద్దువల్ల భారతదేశం ఎప్పటికి పుంజుకుంటుందో తెలియదు. జగన్ అభివృద్ధి వ్యతిరేక నిర్ణయాల వల్ల “చేతిలో డబ్బాడని” ఆంధ్రప్రదేశ్ రేపటి కష్టాలు ఊహకే అందడం లేదు!! – పెద్దాడ నవీన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *