ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన రెడ్డి గారికి,
నమస్కారం!
అయ్యా!
నదుల అనుసంధానం, మళ్ళింపుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి మాటలు మనల్ని మాయచేస్తున్నట్టు వున్నాయి. ఏ పరిజ్ఞానమూ లేని మిమ్ములను తనకు కావలసిన విధంగా ఆయన దొర్లించుకు పోతున్నారని సామాన్యుడిని అయిన నాకే అనిపిస్తున్నది.
మీరు దయచేసి మన జల వనరుల నిపుణులు చెబుతున్న విషయాల పైన మాత్రమే దృష్టి పెట్టండి.
బంగారు తెలంగాణ అని వారి ఆశలను నీరుగార్అమ్మకు అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు చీర పెడతా అన్నట్టున్న కెసిఆర్ గారడీలో పడిపోవద్దని మీకు మనవి.
రాయలసీమ ప్రాంతం కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో లేదని, నిర్మాణంలో ఉన్న తెలుగు గంగ, హంద్రీ – నీవా, గాలేరు – నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు నీటిని కేటాయించడానికి వీల్లేదని, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ముచ్చుమర్రి ఎత్తిపోతలను మూసి వేయాలంటూ అడ్డగోలు వాదనలు, అవాస్తవాలతో కూడిన “అఫిడవిట్”ను బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు దాఖలు చేశారు. దాన్ని తక్షణం ఉపసంహరించుకొంటే కేసీఆర్ ని కొంతైనా నమ్మవచ్చు!
కేంద్ర జల సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం మేరకు ఏర్పాటు చేసిన అఫెక్స్ కౌన్సిల్ మరియు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతి లేకుండానే శ్రీశైలం జలాశయం నుండి నీటిని తోడేసే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడాన్ని కెసిఆర్ ఎలా సమర్థించుకొంటారో ముందు తేల్చమనండి.
పోతిరెడ్డిపాడు నుండి నీటిని తరలించాలంటే శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటి మట్టాన్ని పరిరక్షించాలి. 834 అడుగులను యం.డి.డి.ఎల్. గా నిర్ధారిస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసి, అమలు చేస్తున్న జీ.ఓ. ను రద్దు చేయడానికి కేసీఆర్ అంగీకరిస్తారో లేదో అడగండి
132 టియంసిల నిల్వ సామర్థ్యంతో నిర్మించబడిన తుంగభద్ర డ్యాంలో పూడిక వల్ల 100 టియంసిలకు పడిపోయింది. పర్యవసానంగా ఆ నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతున్నది. కర్నూలు జిల్లాలోని సుంకేసుల ఆనకట్టకు పైభాగంలో 20 టియంసిల సామర్థ్యంతో గుండ్రేవుల రిజర్వాయరు నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టింది. అలాగే సిద్ధేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. వాటికి కేసీఆర్ ప్రభుత్వం అంగీకారాన్ని తెలియజేస్తుందో లేదో అడగండి.
వీటన్నిటికీ కెసిఆర్ సరే అంటే అపుడు ముందుగా రెండు రాష్ట్రాల జల నిపుణుల స్థాయిలో సంప్రదింపులు మొదలు పెట్టవచ్చు!
ఏమైనా మనరాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కెసిఆర్ గారి మాటల్లో చిత్తశుద్ది మీద నాలాంటి సామాన్యులకే ఇంకా నమ్మకం కుదరడం లేదన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి
ఇట్లు
పెద్దాడ నవీన్ అనే ఒక పౌరుడు
17-8-2019