మోదీ గారికి……చిత్తగించవలెను, జగన్

ప్రధాని నరేంద్రమోదిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో కలసి ఇచ్చిన వినతి పత్రంలో అంశాలు
* రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి. 
* విభజన కారణంగా రాష్ట్ర ఆదాయాలకు గండిపడింది. 2014–15 నాటికి రూ.97వేల కోట్లు ఉన్న అప్పులు 2018–19 నాటికి రూ.2.58లక్షల కోట్లుకు చేరాయి. 
* పోలవరం ఎడమ కాల్వ ద్వారా ఉత్తరాంధ్రలో చెరువులను అనుసంధానం చేయడానికి సహకరించండి. కృష్ణా డెల్టాకే కాకుండా కరవుపీడిత సీమ ప్రాంతానికి జలాలు అందించి తాగునీరు, సాగునీటి కొరతను నివారించడానికి సహాయం చేయండి.
* కృష్ణా రివర్‌లో నీటి లభ్యత తగ్గిపోయింది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గోదావరిలో జలాలను తరలించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రెండు నదుల అనుసంధానానికి సహకరించండి.
* ఇంటింటికీ రక్షిత తాగునీటి కల్పించడానికి వాటర్‌ గ్రిడ్‌ను తీసుకొస్తున్నాం. రూ.60వేల కోట్లు ఖర్చు అవుతుందనే అంచనాలున్నాయని.. దీనికి సహాయం అందించండి.
* ఏడాదిలో 25 లక్షల మందికి ఇళ్లస్థలాలు ఇవ్వబోతున్నాం. సెక్‌ డేటా సరిగ్గా లేకపోవడంవల్ల రాష్ట్రం నష్టపోతోంది. ఈ డేటా వల్ల కేవలం 10.87లక్షల మంది లబ్ధిదారులను మాత్రమే కేంద్రం ఎంపిక చేసింది. సెక్‌ డేటాను సరిచేసి లబ్ధిదారులకు న్యాయం చేయండి.
* ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు రాయితీలు ఇవ్వండి.. 10 ఏళ్లపాటు జీఎస్టీ మినహాయింపు కల్పించండి.
* పదేళ్ల పాటు ఇన్‌కంట్యాక్స్‌ మినహాయింపులు ఇవ్వండి.. ఈ పదేళ్లు 100 శాతం ఇన్సూరెన్స్‌ ప్రీమియం రియింబర్స్‌మెంట్‌ కల్పించండి.. రెవిన్యూ లోటు రూపంలో రూ.22,948 కోట్లను చెల్లించండి. 
* ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టుకోసం గతంలో ఖర్చుచేసిన రూ. 5,103 కోట్లను రీయింబర్స్‌ చేయండి. ఈ ఏడాది భూసేకరణ, పునరావాసం కోసం రూ.16వేల కోట్లు మంజూరు చేయండి. 
* కడప స్టీల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామంటూ పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చారు. ఇనుప గనులు, నీటి వసతి లభ్యత ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేశాం. దీనికి పోర్టు, రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలు ఉన్నాయి.  స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకు రండి. 
* దుగ్గరాజపట్నం వద్ద పోర్టును ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చారు. దీనికి బదులుగా రామాయపట్నంవద్ద పోర్టును నిర్మించాలని కోరుతున్నాం.
* రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికి రూ.1500 కోట్లు ఇచ్చారు. అవకతవకలపై విచారణ జరుపుతున్నాం… విచారణ పూర్తయ్యాక శాస్త్రీయ దృక్పథంతో రాజధాని నిర్మాణానికి సహకరించండి.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మంగళవారం నాడు ముందుగా సీఎంవో అధికారులతో.. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన సమస్యలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించి తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రధాని మోడీతో దాదాపు 40 నిమిషాల పాటు చర్చలు జరిపారు. సీఎం జగన్ వెంట పలువురు వైసీపీ ఎంపీలు, ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి తదితరులున్నారని సమాచార పౌరసంబంధాల శాఖ ప్రకటనలో తెలియచేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *