పొదుపులు బంగారంలో పార్కింగ్!

(శనివారం నవీనమ్)

నరేంద్రమోదీ ప్రభుత్వ విధానాలు, ఆర్ధిక విధానాల వల్ల, పెద్దనోట్ల రద్దు తరువాత నుంచి రియల్ ఎస్టేట్లు పడిపోయాయి, స్టాక్ మార్కెట్లు పతనమౌతున్నాయి. మార్కెట్ అనిశ్చిత వల్ల దేశంలో దాదాపు షేర్లను తెగనమ్ముకోవడం ద్వారా పెట్టుబడి దారుల చేతుల్లోకి 10 లక్షల కోట్ల రూపాయల లిక్విడ్ మనీ వాపసు వచ్చిందని విశ్లేషణలు అంచనా. ఈ మొత్తాన్ని సురక్షితమైన పెట్టుబడిగా మలచుకునే మధ్యతరగతి పొదుపుదారుల రష్ బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణమని భావిస్తున్నారు.

బంగారం ధర ఎన్నడూ లేని విధంగా మొదటిసారి 38 వేల మార్క్‌ను దాటేసింది.

నోట్ల రద్దు తర్వాత ధరలు ఇంత భారీ స్థాయిలో పెరగటం ఇదే మొదటిసారి. నోట్ల రద్దు తర్వాత పెరిగిన బంగారం ధరలు కొద్ది కాలం తర్వాత తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించటం లేదు. శ్రావణ మాసం ప్రారంభమైనప్పటికీ… ధరలు పెరగడంతో ఇప్పటికే 50 శాతం కొనుగోళ్లు తగ్గిపోయాయి. శ్రావణ మాసం వేళ బంగారం కొనాలనుకున్న పసిడి ప్రియులకు పెరిగిన ధరలు నిరాశను మిగిల్చాయి.

బంగారమంటే భారతీయులకు చైనావారికి ఎనలేని మోజు. ఇది మన సంస్కృతి, సాంప్రదాయాల్లో భాగం. కొంత మంది బంగారు ఆభరణాలను అందం, హోదా కోసం ధరిస్తుంటే.. మరికొంత మంది తమకు ఆర్థిక రక్షణగా ఉంటుందని కొనుగోలు చేసి దాచుకుంటున్నారు. ఫలితంగా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అంతకంతకు పెరుగుతూ కోలుకోని షాక్‌ ఇస్తున్నాయి. ఇక పెళ్లిళ్లు, పేరంటాల సమయంలో ఆభరణాలకు డిమాండ్‌ మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది.

ఢిల్లీలో బుధవారం 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1113 రూపాయలకు పెరగగా.. గురువారం అది 550 రూపాయలకు చేరింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ సమాచారం ప్రకారం ప్రస్తుతం ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 38 వేల 470 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్‌లో… 24 క్యారెట్ బంగారం ధర 38 వేలు 950 రూపాయలు ఉండగా… 22 క్యారెట్ బంగారం ధర 35 వేల 580 రూపాయలుగా ఉంది. ఇలానే పెరుగుతూ పోతే మరి కొన్ని రోజుల్లోనే 43 వేల మార్క్‌ దాటిన ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు బిజినెస్‌ ఎనలిస్టులు. అంతే కాదు అటు వెండి ధర కూడా భగ్గుమంటోంది. వెండి ధర కూడా పరుగులు తీస్తూ ప్రస్తుతం 44 వేల మార్క్‌కు చేరింది.

అమెరికా, చైనా మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు నెలకొనడం బంగారం పెరగడానికి ఒక కారణమైతే.. దేశీయంగా ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తుండడం మరో కారణం. అందుకే గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అటు అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. పలు దేశాల్లో రాజకీయ అనిశ్చిత పరిస్థితులున్నాయి. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వు దశాబ్దకాలం తర్వాత వడ్డీ రేటును తగ్గించింది. మరింతగా తగ్గించడానికి అవకాశం ఉందని సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల రక్షణ కోసం బంగారాన్ని నమ్ముకుంటున్నారు. పెట్టుబడులను పసిడిలోకి మళ్లిస్తున్నారు. ఇది ధరల పెరుగుదలకు కారణమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *