“దిశమారిన ఎన్ కౌంటర్

(శనివారం నవీనమ్)

దారుణమైన నేరం చేసినవారిని పోలీసులే హత్య చేయాలని ప్రజలు బహిరంగంగా డిమాండు చేసేటంతగా “ఎన్ కౌంటర్ అర్ధం మారిపోయింది. ఇతర అంశాలతోపాటు న్యాయప్రక్రియలో మితిమీరిన ఆలస్యం, ఉదాసీనం ఇందుకు మూలం!

ప్రాణరక్షణ కోసం తప్పని సరైన స్థితిలో దాడి చేసిన వారి ప్రాణాలు తీయడం నేరం కాదు. ఐపిసి 100 వ సెక్షన్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇదే సెక్షన్ ను అడ్డుపెట్టుకుని పోలీసులు నక్సలైట్లనో, రౌడీషీటర్లనో కాల్చివేసి ఎన్ కౌంటర్లు అనడం మామూలైపోయింది. ప్రజలుకూడా ఎన్ కౌంటర్ అంటే కోర్టు కాకుండా పోలీసులు వేసే “శిక్ష”గా అర్ధం చేసుకుంటున్నారు. జనబాహుళ్యంలో ఇది చట్టవిరుద్ధం, అక్రమం అన్న స్పృహే లేకపోతోంది. ఆ స్పృహ వున్నా న్యాయం చేయడంలో కోర్టులు విపరీతమైన జాప్యం చేస్తున్నందువల్ల “ఎన్ కౌంటర్” లకు డిమాండు పెరుగుతోంది.

హైదరాబాద్ దిశ, వరంగల్‌ మానస, ఆసిఫాబాద్‌ టేకులక్ష్మి, మరోచోట మూగమ్మాయి, వేరొకచోట మానసికవికలాంగురాలు, జిల్లాలో నిర్భయ, ఇంకా ఎందరెందరో… పల్లెలో చదువులేని చిన్నతరగతి మనుషులకంటే పట్టణాలలో జరిగే నేరానికి మమేకత ఎక్కువ, మధ్యతరగతి బాధకు స్పందన ఎక్కువ. మధ్య తరగతికి నోరు కూడా ఎక్కువ. టివిల ఫోకస్ మొత్తం అక్కడే. ఇందుకే

ఇపుడు దిశ కు అప్పుడు నిర్భయకు వచ్చినంత ప్రాచుర్యం మరెవరికీ రాలేదు…

అత్యాచారంజరిగినపుడు నిర్భయ పెనుగులాట, పోరాటం, “భయమైతున్నది పాపా” అని దిశ చేసిన దీనాలాపం ప్రజలకు బాగా కనెక్టు అయ్యాయి. ఈ సంఘటనలు రేకెత్తించిన భావోద్వేగాలను రాజకీయ అధికారం సొమ్ము చేసుకున్నట్టు అనిపిస్తున్నది. ఏదోరూపంలో వారి ఆమోదం తరువాతే ఎన్ కౌంటరయ్యిందన్న నమ్మకం కుదురుతున్నది.

కలిగిన కలవరం నుంచి, తక్షణ శిక్షనో, బహిరంగ శిక్షనో అడుగుతున్నాము తప్ప, అది పరిష్కారం కాదు. దిశ సంఘటన అనంతరం కూడా పల్లెల్లో పట్టణాలలో అత్యాచార సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్నిటికే స్పందనలు ఎక్కువ లభిస్తాయి.

ఫలితంగా జనసామాన్యంలో ఉన్న ఆగ్రహం చల్లబడింది. అపుడు వరంగల్ లో ఇపుడు హైదరాబాద్ లో జరిగింది దోషుల కాల్చివేత. అపుడు వరంగల్ లోనూ ఇపుడు హైదరాబాద్ లోనూ సజ్జనారే! ఆయన చెపుతున్న ఎన్ కౌంటర్ “కథే ”.దోషులపట్ల సమాజంలో సానుభూతి లేనందువల్ల కాల్చివేత అన్యాయం అనిపించడంలేదు.

మా ఇంట్లో నేను ఇద్దరు కొడుకులు నా భార్య వుంటాము. ఆమె ఆవేశపరురాలు కాదు. ఈ కేసులో వెంటనే న్యాయం జరిగింది అని నా భార్య కామెంట్ చేసింది. ఈ వ్యాఖ్యానాన్ని స్త్రీల మనోభావాలకు ప్రతీకగా తీసుకుంటున్నాను. గౌరవిస్తున్నాను.

సరే ఎన్ కౌంటర్ అయిపోయింది. ఇందులో చనిపోయిన నలుగురూ దిక్కూమొక్కూ లేనివారు. అడగటానికో, మద్దతుగా నిలబడటానికో వెనుక ఎవరూ లేనివారు. నేర ప్రపంచ సాన్నిహిత్యంతో నియమాలను ధిక్కరించి వ్యవహరించేవాళ్లు మరికొందరు. వీళ్లు దరిద్రులు. అల్పులు. కనిష్ఠ స్థాయి సంస్కారంతో బొటాబొటి ఆదాయంతో బతుకు ఈడుస్తారు. గాఢమైన మానవసంబంధాలూ వీళ్లకు ఉండవు. ఢిల్లీలోనూ హైదరాబాద్‌లోనూ పెద్ద సంచలనాలు కలిగించిన నేరస్థులు ఈ కోవ వాళ్లే. వీళ్ళ చావులు వారి వారి కుటుంబీకులకు కూడా గట్టిగా పట్టుకోవు.

అత్యాచారాలు చేసే ఎగువ తరగతుల, వర్గాల జులాయిలు ఎన్ కౌంటర్ అవుతారా? అవుతారని ఊహించగలమా?

ఆవేశంలో వున్న ప్రజల డిమాండు మేరకు రాజకీయనాయకత్వం మద్దతుతో పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోడం అంటే అది మూకస్వామ్యం అవుతుంది. దీన్ని నేను సమర్ధించలేను.

వెంటవెంటనే న్యాయం జరిగేలా కోర్టుల పనిలో మార్పులు రాకపోతే తుపాకి చేతిలో వున్న పోలీసులు స్వయం తీర్పరులైపోయే ప్రమాదం ఒక ధోరణిగా పెరిగిపోతుందని భయపడుతున్నాను.

న్యాయ ప్రక్రియలో అనవసరమైన జాప్యం, అనాసక్తత మాత్రం క్షమార్హం కానివి. వాటిని సరిదిద్దుకోవాలని ఒత్తిడి తేవాలి. అయితే, ప్రతి విచారణ న్యాయప్రక్రియ ఆసాంతం గడచి గట్టెక్కవలసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *