కథలోతు 400 ఏళ్ళు

(శనివారం నవీనమ్)

అయోధ్యలో అతిపెద్ద రామమందిరం ఉండేది. అక్కడ బాబ్రీ మసీదును ఎవరు నిర్మించారనే అంశంపై రెండు వాదనలు ఉన్నాయి. ఒక వాదన ప్రకారం భారతదేశంలో మొగల్ సామ్రాజ్యాన్ని వ్యవస్ధాపకుడు బాబర్ ఆదేశం మేరకు అతని సేనాని మీర్ బఖీ 1528లో బాబ్రీ మసీదును నిర్మించారని ఒక రికార్డు చెబుతోంది. అయితే స్థానికంగా వినిపించే కథనాల ప్రకారం చక్రవర్తి ఔరంగజేబ్ అక్కడున్న రామమందిరాన్ని కూల్చివేసి బాబ్రీ మసీదును నిర్మించాడు. బాబ్రీ మసీదును బాబర్ ఆదేశాల మేరకు మీర్ బఖీ నిర్మించినా లేక ఆ తరువాత ఔరంగజేబ్ దీనిని నిర్మించినా అది రాముడి దేవాలయం స్థానంలో జరిగింది.

రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం అంతగా ఊపందుకోని 1976-77 సంవత్సరంలో ఆర్కియలాజికల్ సర్వే ఇఫ్ ఇండియా జరిపిన తవ్వకాల ప్రకారం వివాదాస్పద భూమిలో ఒకప్పటి బ్రహ్మాండమైన దేవాలయం అవశేషాలు కనిపించాయి. కనీసం యాభై స్తంభాలతో కూడిన హిందు దేవాలయం ఆనవాళ్లు అక్కడ తమకు కనిపించాయని అప్పటి సర్వే టీం సభ్యుడు కె.కె.మహమ్మద్ కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. వివాదాస్పద భూమిలో తవ్వకాలు జరిపినప్పుడు బాబ్రీ మసీదులో తాను స్వయంగా పన్నెండు హిందూ దేవాలయాల స్తంభాలు చూశానని ఆయన వివరించారు.

ప్రముఖ చరిత్రకారుడు సయ్యద్ నూరుల్ హసన్ కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర శాఖ)గా ఉన్నప్పుడు ఈ తవ్వకాలు జరిగాయనేది మరిచిపోరాదని ఆయన అంటున్నారు. ఇరవైఏడు దేవాలయాలను కూలగొట్టి నిర్మించిన ఢిల్లీలోని కుతుబ్ మినార్ వద్ద ఉన్న కువ్వతుల్ ఇస్లామ్ మసీదులో కూడా ఇలాంటి స్తంభాలున్నాయి, ఎవరైనా వెళ్లి చూసుకోవచ్చునని ఆయన వాదిస్తున్నారు. బి.బి.లాల్ నేతృత్వంలో జరిగిన తవ్వకాల్లో పలు టెర్రకోటా బొమ్మలు ముఖ్యంగా హిందూ దేవతామూర్తుల బొమ్మలు లభించాయి. అలహాబాద్ హైకోర్టు ఆదేశం మేరకు 2003లో ఏ.ఎస్.ఐ జరిపిన తవ్వకాలలో కూడా వివాదాస్పద స్థలంలో ఒకప్పుడు దేవాలయం ఉండేదనేది స్పష్టమైంది.

చరిత్రలోకి వెళితే గౌతమ బుద్ధుడి సమయంలో సాకేతగా పిలవబడిన అయోధ్య ఉత్తరాదిలోని ఆరు అతి పెద్ద నగరాల్లో ఒకటి. గుప్తుల కాలంలో అయోధ్య వారి రాజధాని. మహాకవి కాళిదాసుడు తన రఘువంశాన్ని ఇక్కడే రచించినట్లు చరిత్ర చెబుతోంది. రాముడు అయోధ్యలోని గోప్రతార తీర్థం వద్ద సరయు నదిలోకి ప్రవేశించాడని రఘు వంశం చెబుతోంది. రాముడి మరణానంతరం అయోధ్య పాడుపడిపోగా అతని కుమారుడు కుశుడు దీనిని తిరిగి పునరుద్ధరించాడని కాళిదాసుడు తన రఘువంశంలో తెలిపాడు.

పదకొండవ శతాబ్దంలో గహడవాల రాజుల కాలంలో అయోధ్య మరోసారి వెలుగులోకి వచ్చింది. గహడవాల రాజులు నిర్మించిన పలు విష్ణు దేవాలయాల్లో దాదాపు ఐదు దేవాలయాలు ఔరంగజేబ్ కాలం వరకు ఉండినాయని స్థానికుల వాదన. గహడవాల రాజులు నిర్మించిన విష్ణు దేవాలయాలనే ఔరంగజేబ్ కూల్చివేయించి ఉంటాడన్నది ప్రముఖ ఇండాలజిస్ట్ హాన్స్ టి. బక్కర్ వాదన.

భారతదేశంపై దాడి చేసే ముందు ఖరందర్ (సూఫీ సన్యాసి) వేషంలో అవద్ (అయోధ్య)కు వచ్చినప్పుడు అక్కడి సూఫీ సన్యాసులు షా జలాల్, సయ్యిద్ ముసా ఆషిఖన్‌కు చేసిన వాగ్దానం మేరకే బాబర్ ‘జన్మస్థాన్’ దేవాలయాన్ని కూల్చి మసీదు నిర్మించాడని సయ్యిద్ మూసా ఆధ్యాత్మిక వారసుడు వౌల్వి అబ్దుల్ కరీం పర్షియన్ భాషలో రాసిన పుస్తకంలో స్పష్టంగా ఉన్నది. మొగల్ చక్రవర్తిబహదుర్ షా కూతురు, ఔరంగజేబ్ మనుమరాలు రాసినట్లు చెప్పే సాహిఫా- అల్-చిహిల్ నసైహ్ బహాదుర్ షాహి అనే పుస్తకంలో మధుర, బనారస్, అవద్‌లోని హిందువుల దేవాలయాలను కూల్చివేసి మసీదుల నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. మొఘలాయీ ప్రభువులు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలోని దేవాలయాలను కూల్చివేసి మసీదులను నిర్మించారన్నది చరిత్ర చెప్పే సత్యం. రామమందిరాన్ని కూల్చివేసి మసీదును నిర్మించడం కూడా ఇందులో భాగమే!

ఈ వివాదం డెబ్బై ఏళ్ళ క్రితమే కోర్టుకెక్కింది. 1950 సంవత్సరంలో గోపాల్ సింగ్ విశారద్ అలహాబాద్ హైకోర్టులో ఒక టైటిల్ సూట్‌ను దాఖలు చేశారు. అయోధ్యకు చెందిన పరమహంస్ దాస్ మరో పిటిషన్ దాఖలు చేశారు. 1959లో నిర్మోహీ అఖాడా మరో పిటిషన్ దాఖలు చేసి అయోధ్య-రామజన్మభూమి ప్రాంతాన్ని తమకు స్వాధీనం చేయాలని డిమాండ్ చేసింది. సున్ని వక్ఫ్ బోర్డు కూడా ఒక పిటిషన్ దాఖలు చేసి మొత్తం భూమి తమకు చెందుతుందని వాదించింది.

అలహాబాద్ హైకోర్టు ఈ పిటిషన్లపై 2002లో విచారణ ప్రారంభించి దాదాపు పది సంవత్సరాలపాటు ఇరుపక్షాలు వాదనలు విన్నది. న్యాయమూర్తి ఎస్.యు.ఖాన్, న్యాయమూర్తి సుధీర్ అగర్‌వాల్, న్యాయమూర్తి డి.వి.శర్మ తమ సుదీర్ఘ విచారణలో భారత ఆర్కియలాజికల్ సర్వే సంస్థ ద్వారా వివాదాస్పద భూమిలో ఏదైనా కట్టడం ఉండిందా? అనేది కూడా దర్యాప్తు చేయించారు. ముగ్గురు న్యాయమూర్తులు అందరి వాదనలు విన్న తరువాత 2010 సెప్టెంబర్ 30 తేదీనాడు తమ తీర్పుఇచ్చారు.

ఆతీర్పులో రాముడి విగ్రహం ఉన్న భూమిని రాం లల్లా విరాజ్‌మాన్ సంస్థకు, సీతామాత వంటగదిగా ముద్ర పడిన భూమిని నిర్మోహీ అఖాడాకు, మిగతా భూమిని సున్ని వక్ఫ్ బోర్డుకు కేటాయించారు. కచ్చిదారులకు ఈ తీర్పు నచ్చక సుప్రీం కోర్టులో పిటిషన్లు వేశారు. 9 ఏళ్ళతరువాత సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి రంజన్ గొగోయ్ నాయకత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం గత ఆగస్టు ఆరో తేదీ నుండి ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభించి ఇప్పటికి పూర్తి చేసింది. ఆయన అధ్యక్షతన న్యాయమూర్తులు ఎస్.ఏ.బోబ్డె, న్యాయమూర్తి వై.చంద్రచూడ్, న్యాయమూర్తి అశోక్ భూషన్, న్యాయమూర్తి ఎస్.అబ్దుల్ నజీర్ ధర్మాసనంలో సభ్యులుగా వున్నారు.

ఇలా… చారిత్రపరంగా 400 వందల సంవత్సరాల నుండి, వివాదాల పరంగా గత 170 సంవత్సరాలనుండి, కోర్టుల పరంగా గత డెబ్బై సంవత్సరాల నుండి కొనసాగుతున్న రామజన్మ భూమి, అయోధ్య-బాబ్రీ మసీదు వివాదానికి ధర్మాసనం అధ్యక్షుడు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి రంజన్ గొగోయ్ పదవీవిరమణ చేసే నవంబరు 17 న లేదా ఆలోగా తీర్పు రావలసివుంది.

అలహాబాద్ హైకోర్టు 2010 సెప్టెంబర్ 30వ తేదీనాడు ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థిస్తుందా? లేక తమ విచారణ సందర్భంగా వెలుగులోకి వచ్చిన విభిన్న అంశాల ఆధారంగా మరింత విస్తృతమైన తీర్పును ఇవ్వటం ద్వారా ఈ వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరిస్తుందా? రామమందిరం-బాబ్రీ మసీదు వివాదంపై తీర్పు ఏదైనా, అది దేశ రాజకీయాలతోపాటు సామాజిక పరిస్థతులను ఒక మలుపు తిప్పే అవకాశం వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *