స్పందనా రాహిత్యమే జాతీయ రైతు విధానం

ఇది…కష్టాలు, ఆశలు అరణ్యరోదనగా మారినపుడు, తమ మనోభావాలకు వేదికగా వుండవలసిన ప్రజా ప్రతినిధులు దగా పూరితంగా వ్యవహరిస్తున్నపుడు, రైతులు తమ గుండెకోతను వ్యక్తం చేయడానికి మిగిలిన మార్గం…ఆత్మహత్య
ఇది…వ్యక్తిగతం కాదు, వ్యవస్ధీకృతం!

IMG_0379

నెలకొనివున్న పరిస్ధితులమీద నిర్వేదం, భవిష్యత్తు మీద నిరాశ, నిర్ణయం తీసుకోవలసిన వారిలో పట్టించుకోనితనం 20 ఏళ్ళుగా దేశమంతటా దాదాపు 3 లక్షల వేలమంది వ్యవసాయదారుల ఆత్మహత్యకు కారణమయ్యాయి. ఇందులో 2 లక్షల మంది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్, చత్తీస్ ఘర్, తెలంగాణా రాష్ట్రాల వారే! మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలు అత్యధికంగా వున్నాయి. అక్కడ గత 30 రోజుల్లో 100 మంది వ్యవసాయదారులు ఆత్మహత్య చేసుకున్నారు.తెలంగాణాలో 4 నెలల్లో 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వరుసగా రెండు మూడేళ్ళు పంట దెబ్బతింటే రాష్ట్రానికో దేశానికో పెద్ద ఇబ్బంది వుండదుకాని, పైరువేసిన రైతులు కోలుకోలేనంతగా చితికిపోతారు. ఇది వేళ్ళు తెగిపోయి మొక్క చచ్చిపోవడంలాంటిదే. ఈ పరిస్ధితికి ప్రభుత్వాల విధానాలు, ప్రకృతి వ్యతిరేకతలు, సాంఘిక అవసరాలు, సాంప్రదాయాలు మూలకారణాలు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యలు అసాధారణమేమీకారు. అయితే వ్యవస్ధాగతమైన కారణాలతో రైతులు తప్ప మరెవరూ ప్రాణాలుతీసుకోవడంలేదు. సరళీకృత ఆర్ధిక విధానం లేదా గ్లోబలైజేషన్ 1990 లో దేశంలో కాలుపెట్టింది. దాని అనర్ధం 1995 లో మొదలైంది. ఆయేడాది దేశవ్యాప్తంగా 16 వేలమంది రైతులు చనిపోయారు. అప్పుడుమొదలైన రైతు ఆత్మహత్యలు ఏటేటా పెరుగుతూ సాగిపోతూనే వున్నాయి. వ్యవసాయం వ్యాపారం కాదు…అది ఒక జీవన విధానం. ఏటా తొలిపంటకు అప్పు చేయవలసిందే. కుటుంబాన్ని గడుపుకుంటూ, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళకు ఖర్చుచేసుకుంటూ దిగుబడులను అమ్మి అప్పుతీర్చకోవలసిందే. వర్షాలు లేకపోవడం, ఎక్కువగా కురవడం, తుపానులు విరుచుకుపడటం లాంటి ప్రకృతి అననుకూలతలు, ధర గిట్టుబాటుకాని ప్రభుత్వాల విధానాలు, దళారులకు ఉపయోగపడే కార్యాచరణలు రైతులను కోలుకోలేనంత అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. సంస్కరణలు ప్రారంభించిన ప్రధాని పివినరశింహారావు మొదలు, శరవేగంతో అమలు చేస్తున్న నరేంద్రమోదీ వరకూ ఏ కేంద్రప్రభుత్వమూ ఏ రాష్ట్రప్రభుత్వమూ రైతు దిగబడిపోతున్న అప్పుల ఊబిగురించి సీరియస్ గా పట్టించుకోనేలేదు. చంద్రబాబునాయుడు, కెసిఆర్ ప్రభుత్వాల రుణమాఫీ వారు అధికారంలోకి రావడానికి ఓట్లను పండించిందేమోకాని, ఆంధ్రప్రదేశ్ రైతుల్ని, తెలంగాణా రైతుల్ని కొత్తరుణం పుట్టనంత ఇరకాటంలోకి నెట్టేసింది. రైతుకుటుబాల వారికి పెళ్ళిళ్ళు కుదరని పరిస్ధితి అటూఇటూ దేశమంతా వుందంటే సమాజనుంచి రైతులు ఎలా దూరమైపోతున్నారో అర్ధం చేసుకోవచ్చు చరణ్ సింగ్ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా వున్నపుడు దేశవ్యాప్తంగా ఒక పరిమితికి లోబడి రుణాలను మాఫీ చేసినపుడు ఆంధ్రప్రదేశ్ రైతులకు 8 వేలకోట్ల రూపాయల ప్రయోజనం లభించింది. మూలాలలు గుర్తించని లేదా గుర్తించడానికి ఇష్టపడని రాజకీయనాయకులు ఆత్మహత్య చేసుకున్నది రైతే అయినప్పటికీ అందుకు కారణం వ్యవసాయసంబంధమైనది కాదని భాష్యాలు చెబుతున్నారు. ఏకారణమైనా జీవనవిధానమైన వ్యవసాయం నుంచి వచ్చినదే అని అంగీకరిస్తే ఆబాధ్యతను తీసుకోవలసి వుండటమే వక్రభాష్యాలకు మూలం. వ్యవసాయ పెట్టుబడులు పెరిగాయి. బోర్లపై ఆధారపడటం అధికమైంది. బోర్లు విఫలం కావడంతో రైతులపై భారం పెరిగిపోతోంది. ధరలు గిట్టుబాటు కావడంలేదు. కనీస పెట్టుబడులు కూడా తిరిగి రావడంలేదు.రైతులు సుస్థిరమైన వ్యవసాయ విధానాలు అనుసరించడంలేదు. చిన్న కమతాలు, కౌలు సేద్యంతో కలిసిరావడంలేదు. వ్యాపార స్వేచ్ఛ, ఎగుమతి-దిగుమతి విధానాలు రైతులకు అనుకూలంగా లేవు. బీమా, మార్కెటింగ్, నిల్వ సదుపాయాలు తగిన స్థాయిలో లేవు. వర్షాధార వ్యవసాయాన్ని ప్రభుత్వం విస్మరించింది. ప్రభుత్వ విధానాలు పెద్ద రైతులకు, భారీ తరహా వ్యవసాయానికి, కొన్ని రకాల వ్యాపార పంటలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. చంద్రబాబు కొంత వాస్తవిక దృక్పధంతో ”వ్యవసాయం దండుగమారి”గావుంది అంటే ఆయన్ని రైతు వ్యతిరేకిగా కాంగ్రెస్ సహా అన్నిరాజకీయపార్టీలూ ఇప్పటికీ చీల్చి చెండాడేస్తూవుంటాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రైతు వ్యతిరేకి కాకపోవచ్చు. అయితే రైతు అనుకూలతను ఆచరణలో చూపించడానికి ఆయన ఏ అవకాశాన్నీ వినియోగించకోలేదు. ప్రధానమంత్రి కార్యాలయం గత డిసెంబరులోనే అన్ని రాష్ట్రాలనుంచీ రైతు ఆత్మహత్యల వివరాలు, మూలాలపై నివేదికలు తెప్పించుకుంది.అన్నిరంగాల్లోనూ పెను మార్పుల్ని సరికొత్తగా సూచిస్తున్న నరేంద్రమోదీ కూడా రైతు ఆత్మహత్యలను నివారించే విధానాలగురించి ఇంతవరకూ సూటిగా మాట్లాడలేదు. ఇది ‘రైతుల పట్ల స్పందనా రాహిత్యమే జాతీయవిధానం’ అన్నట్టువుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *