స్కిల్ ఇండియా

అత్యధికమైన వృత్తి నైపుణ్యాలు బిసిల చేతుల్లోనే వున్నాయి. వాటికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సానబట్టే ‘నైపుణ్యభారత్’ సోషల్ ట్రాన్స్ ఫర్మేషన్ ని తీసుకువస్తుంది. రామస్వామి పెరియార్ సాంఘిక ఉద్యమాల ద్వారా బిసిలను కూడగట్టారు. ఇప్పటికీ తమిళనాడు రాజకీయపార్టీల్లో ప్రాబల్యం బిసిలదే. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ టి ఆర్ ‘ఆదరణ’ పధకం ద్వారా బిసిల ఆర్ధిక ఉన్నతికి దోహదపడ్డారు. అది తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకు అయ్యింది.

నేడు 63 వ సంవత్సరంలో ప్రవేశించిన నరేంద్రమోదీ ‘స్కిల్ ఇండియా’ దేశవ్యాప్తంగా బిసి ఎంపవర్ మెంటుకి బాటవేస్తుంది.

ప్రపంచంలో తయారీ రంగ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలకు రాజధానిగా చైనా అవతరించినట్లే మానవ వనరులకు ప్రపంచ రాజధానిగా భారత దేశం నిలవాలని ప్రధాని నరేంద్రమోడీ ఆకాంక్షిస్తున్నారు. దీన్ని సాకారం చేయడానికి ”నైపుణ్యభారత్” ఆలోచనను, కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇంటా బయటా ప్రత్యర్ధులే లేకుండా చూసుకునే భారత ప్రధాని నరేంద్రమోదీ రాజకీయ విధానానికీ, ఏదేశం కార్పొరేట్ల పెట్టుబడులనైనా ఆకర్షించే ఆయన ఆర్ధిక విధానానికీ, వస్తున్నంత పాపులారిటీ పబ్లిసిటీ అంతా ఇంతా కాదు. సోషల్ ఇంజనీరింగ్ లో వస్తున్న మార్పుని వేగవంతం చేసే మోదీ సాంఘిక విధానం మీద మీడియా ఫోకస్ దాదాపు లేదనే చెప్పాలి. మానవ వనరులు,వృత్తులు,నైపుణ్యాలకు సాంకేతిక విజ్ఞానాన్ని అనుసంధానం చేసే మోదీ ”నైపుణ్యభారత్” ఆలోచన ”కౌశల్ వికాస్ యోజన” కార్యక్రమాలు చిన్నవికాదు. పైగా చాలా మౌలికమైనవి. భారత సాంఘిక సామాజిక పరిణామాలు, రూపాంతరాల బేసిస్ తో చూసినపుడే మోదీ తలపెట్టిన ట్రాన్స్ ఫర్మేషన్ అర్ధమౌతుంది. సువిశాలమైన భారతదేశంలో జీవవిధానం భిన్నమైన వృత్తులు, చేతివృత్తుల తో పరస్పరపోషకంగా, పరస్పర ఆశ్రితంగా వుండేది. ఇత్తడి పని, బంగారం పని, ఇనుప పని, కర్ర పని, రాతిని చెక్కే పని.. రాళ్ళు కొట్టే పని, సన్నాయి ఊదే పని, డప్పులు కొట్టే పని, పూలమాలలు కట్టేపని, అడేపని, పాడేపని ఇలా ఒక్కో కులానికి ఒకపనిని నిర్ధేశించి నైపుణ్యాల అభివృద్ధికి చెప్పలేనంత సేవచేసింది. యూరప్ లో పారిశ్రామిక విప్లవం వచ్చే వరకు ప్రపంచానికి పట్టు, చేనేత వ్రస్తాలను, సున్న్నిత ఉపకరణాలను భారతదేశమే సరఫరా చేసేది. బ్రిటిష్ వారి దోపిడి, నిరాదరణ, పారిశ్రామిక విప్లవం రెండు ప్రపంచ యుద్దాలు భారతదేశాన్ని, ఇక్కడి వృత్తి కులాలను పతనావస్థలో పడేశాయి. స్వతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచిన దీనిని బాగుచేసే పెద్ద ప్రయత్నాలేవీ జరగలేదు. అయినా భారతదేశపు సాంకేతిక అవసరాల్లో 60 నుంచి 70 వృత్తికులాల వారే తీరుస్తున్నారు. సామాజిక అవసరాలు, అనివార్యతలే ఒకో కులాన్ని సృష్టిస్తూవచ్చాయి.. ఆ కులం ఆ పనినే చేసుకుపోతూ ఉంది. ప్రతి తరంలో సృజనశీలురు రూపొందించిన కొత్త పద్దతులను నైపుణ్యాలను ఆ కులం పోగులు పెట్టి తరువాత తరంవారికి వారసత్వంగా అందజేస్తోంది. ఒక అంచనా ప్రకారం అలా తరతరాలుగా కనీసం 80 తరాల వారు కనుగొని సాధించిన నైపుణ్యాలు కులవృత్తుల వారి దగ్గరన్నాయి. కుల వ్యవస్ధ సమాజంలో సమతూకాన్ని నిలబెట్టేది. కులపెద్దలు సమాజమంతటికీ పెద్దన్నల పాత్ర నిర్వహించేవారు.బ్రిటిష్ పాలకులకు ముందు కులసంఘంలో భద్రత లుండేవి. తిండి, ఇల్లు, సామాజిక అవసరాల విషయంలో కులం కనీస గ్యారేంటిని ఇచ్చేది. పని మంతులకుఎక్కువ నైపుణ్యం కలవారికి ఎక్కువ లబ్ది కలిగేది. సామర్థ్యం ఉన్న వారు సంఘానికి నాయకత్వం వహించి ఎక్కువ సంపాదించేవారు. ఈవిధానమంతా విచ్చిన్నమైపోయాక అగ్రకులాల ఆధిపత్యభావన దాష్టీకమైపోయాక ఆ సోషల్ ఇంజనీరింగా ధ్వంసమైంది. కులవృత్తులు చితికపోవడం మొదలయ్యాక వారందరికీ వెనుకబడిన తరగతులు అనే వేదిక, బిసి లేబుల్ మిగిలాయి. వీరందరినీ ఉద్ధరించాలనే నందమూరి తారక రామారావు ఎమోషన్ ఫలితంగా రూపుదిద్దుకున్న ”ఆదరణ”కార్యక్రమం చేతివృత్తుల వారికి పరికరాలకు రుణాలు వారి పిల్లలకు దాదాపు ఉచిత విద్యలూ ఇచ్చింది. ఈ కొద్దిపాటి ప్రభుత్వ సాయమే తెలుగుదేశం పార్టీకి బిసిలను పెద్ద ఓటు బ్యాంకుగా మార్చివేసింది. విద్యావికాసంతో బడుగు బలహీనవర్గాలవారు, వెనుకబడిన తరగతులవారూ ఆర్ధికంగా సౌష్టవం గడించికూడా ఆర్ధికంగా పేదలైన అగ్రకులాల వారితో ధీటైన ఆత్మవిశ్వాసాన్నీ, ధీమాను చూపించలేని దుస్ధితి ఇంకావుంది. ఇది మనదేశంలో కులవ్యవస్ధలో సంక్లిష్టతకు ఒక సూచిక. దేశప్రధానులూ, రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో అత్యధికులు అగ్రవర్ణాలవారే అయివుండటం ఇందుకు ఒక ముఖ్యకారణమే. వెనుక బడిన తరగతుల్లో (బిసి) జన్మించి స్యయంకృషితో ప్రధాని స్ధాయికి ఎదిగిన నరేంద్రమోదీ రాజకీయ, ఆర్ధిక చర్యలు, కార్యక్రమాలకు సాంకేతికతను జోడించి అట్టహాసంగా పూర్తి చేస్తారు. ప్రధానంగా బిసిల సోషియో, ఎకనమిక్, పొలిటికల్ ఎంపవర్ మెంటుకి దోహదపడే నైపుణ్యభారత్ కాన్సెప్ట్ కి ఆస్ధాయి ప్రచారాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే ఇది వివాదాలు లేకుండా నిదానంగా పూర్తికావలసిన ప్రక్రియ. రాబోయే అయిదేళ్ళలో నైపుణ్యాభివృద్ధికి అవసరమైన కార్యక్రమాల్లో పాల్గోనే 34 లక్షల మంది యువతకు ఐదువేలు నుంచి లక్షన్నర రూపాయల వరకు రుణం అందించే పథకమే నైపుణ్య భారత్. ఏడాది కాలంలో 24 లక్షల మంది యువతకు శిక్షణను ఇచ్చే ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజనను జులై 15 మోదీ ప్రారంభించారు. శిక్షణను అందించి యువతలో నైపుణ్యాన్ని మెరుగుపట్టడం ద్వారా ప్రపంచానికి నాలుగైదు కోట్ల మానవ వనరుల్ని అందించగల సత్తా మన దేశానికి ఉందని ఆయన చెప్పారు. నైపుణ్య భారత్ అంటే సాంకేతిక పరిజ్ఞానం జతపడిన వృత్తినైపుణ్యం మాత్రమే. అయితే వృత్తి నైపుణ్యపు మూలాలు ప్రధానంగా బిసిలలోనే వున్నాయి. అంతమాత్రాన ఇది బిసిల ఉద్ధరణకాదు. అవకాశాలు అందిపుచ్చుకునేలా ప్రోత్సాహం ఇవ్వడం మాత్రమే. 1879 సెప్టెంబర్ 17 న జన్మించిన రామస్వామి పెరియార్ సాంఘిక ఉద్యమాల ద్వారా బిసిలను కూడగట్టారు. ఇప్పటికీ తమిళనాడు రాజకీయపార్టీల్లో ప్రాబల్యం బిసిలదే. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ టి ఆర్ ‘ఆదరణ’ పధకం ద్వారా బిసిల ఆర్ధిక ఉన్నతికి దోహదపడ్డారు. అది తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకు అయ్యింది. 1950 సెప్టెంబరు 17 న పుట్టిన నరేంద్రమోదీ ‘నైపుణ్య భారత్’ దేశవ్యాప్తంగా సోషల్ ట్రాన్స్ ఫర్మేషన్ ని తీసుకువస్తుంది. ఇది వెంటనే కనిపించే విషయం కాదు. కనీసం పదేళ్ళు గడిస్తేకాని ఫలితాలు కనిపించవు. కేవలం దార్శనికతలోనే కాదు, పరిస్ధితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకోడానికి డేటా బేస్, దాన్ని విశ్లేషించే ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ నేడు 63 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న భారతప్రదాని నరేంద్రమోదీ చేతుల్లోనే వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *