శ్రీశ్రీ మరణాన్ని మరణవార్తగా కాక ఉద్వేగభరితమైన అనుభూతిగా పాఠకుల ముందుంచాము

ఆమహాకవి 30 వర్ధంతి జూన్ 16 అన్న ఫేస్ బుక్ ప్రస్తావన చూశాక ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. అప్పటి టెలిప్రింటర్ ఆపరేటర్ గుండిమెడ (రామచంద్ర) శర్మతో ఫోన్ లో మాట్లాడి వివరాలు ధృవీకరించుకున్నాక ఇది రాస్తున్నాను

అప్పుడు నేను తిరుపతి ఈనాడు ఎడిషన్ మఫిషియల్ డెస్క్ ఇన్ చార్జని. కెఎన్ వై పతంజలి గారు జనరల్ డెస్క్ ఇన్ చార్జ్….ఆరోజురాత్రి 7 గంటల ప్రాంతం…బోయ్ ఏకాంబరం వచ్చి ప్రకాష్ సార్ పిలుస్తున్నారంటే జనరల్ డెస్క్ కి వెళ్ళా. షిఫ్ట్ ఇన్ చార్జ్ ప్రకాష్ ఫస్ట్ ఎడిషన్ డ్యూటీ అయిపోయింది. ఇంకో షిఫ్ట్ ఇన్ చార్జ్ రామశేషుగారు నైట్ ఎడిషన్ల డ్యూటీకి వచ్చేశారు. సబ్ ఎడిటర్లు రామశేషుగారు, ప్రకాష్ గారు, విలాసిని గారూ గంభీరంగా వున్నారు.

శ్రీశ్రీ మద్రాస్ లో పోయారు. వార్తతెప్పించండి అని ఓ టెలిప్రింటర్ మెసేజ్ నా చేతికిచ్చారు. అది విజయవాడ ఆఫీస్ నుంచి వచ్చింది. శ్రీశ్రీ మరణవార్తను చలసాని ప్రసాద్ గారు ఫోన్ లో చెప్పారు. వార్తతెప్పించండి అని అందులోవుంది.

మద్రాస్ లో సితార కు మిక్కిలినేని జగదీష్ బాబు రిపోర్టర్. మద్రాసు ఈనాడు ఆఫీస్ కి జగదీష్ బాబు ఇంటికీ, ఆరుద్రగారి ఇంటికీ(నెంబరు ప్రకాష్ ఇచ్చారు) ట్రంకాల్ బుక్ చేశాను. (బహుశ ఈ విషయం ప్రపంచానికి నేనే చెప్పాలన్న బాధ్యత అధికారాలను ఒలకబోస్తూ) ప్రెస్ కాల్ అర్జంట్ అని ఆపరేటర్ నిఅడిగాను. విషయం చెప్పాను. శ్రీశ్రీ ఎవరు అని అతను అడిగాడు.

జగదీష్ బాబు రిపోర్టు ఇవ్వగలరన్న నమ్మకమైతే నాకులేదు. యు ఎన్ ఐ ఏజెన్సీ కాపీకోసమే చూడాలి అని ప్రకాష్ తో అంటే పక్కనే వున్న రామశేషుగారు ఏం ఫరవాలేదు మనవాళ్ళు రాసేస్తారు అన్నారు.

అంతలో కరెంటుపోయింది. ఎవరో “మహాప్రస్ధానం” పుస్తకాన్ని తీసుకు వచ్చారు. కొవ్వొత్తి వెలుగులో శర్మ ఒకో కవితనీ బిగ్గరగా చదువుతూంటే నా డెస్క్ లో సబ్ ఎడిటర్ దాట్ల నారాయణ మూర్తిరాజు కావలసిన లైన్ లను నోట్ చేసుకున్నారు. నా డెస్క్ లో కళత్తూరు సుధాకరరెడ్డి బయటికి వెళ్ళి ఎక్కడినుంచో ఖఢ్గసృష్టి పుస్తకం తెచ్చి ప్రకాష్ కి ఇచ్చారు

ఆరుద్రగారినుంచి కాల్ వచ్చింది నేను రాసుకుంటూనే సైగచేసేస్తే ఏకాంబరం వెళ్ళి ప్రకాష్ ని తీసుకువచ్చారు. ఆయన సంతాపసందేశాన్ని పూర్తిగా రాసుకున్నారు.

ఇంతలో నా డెస్క్ నుంచి నామిని సుబ్రమణ్యం నాయుడు ఓ రిపోర్టు రాసుకొచ్చాడు. శ్రీశ్రీ మరణానికి ఆకాశం బోరున ఏడుస్తోందని…అప్పటి వరకూ బయట పెద్దవాన పడుతోందన్న స్పృహే మాకెవరికీ లేదు. ఆరిపోర్టుని కంపోజింగ్ కు ప్రకాష్ పంపించారు.

శ్రీశ్రీ గారి కవితలనే కోట్ చేస్తూ మరణవార్తను దాట్లనారాయణ మూర్తిరాజు రాశారు. చర్చించుకుని చిన్న మార్పులు చేశారు మొత్తం కాపీ 25/30 పేజీలు వచ్చింది. శర్మ, సత్యనారాయణా ఇతర ఎడిషన్లకు పంపడానికి ఇదంతా టెలిప్రింటర్లలో టైప్ చేశారు.

అది లెటర్ కంపోజింగ్ ఫోర్ మన్ నారాయణ గారు అనేకమంది కంపోజిటర్లకు వార్తను విభజించి యిచ్చి శరవేగంతో కంపోజింగ్ చేయించారు. మామూలుగా ఇచ్చే ప్రూఫ్ గ్యాలు రెండయితే ఆసారి పదో పదిహేనో తీసి అందరికీ ఇచ్చారు.

నా డెస్క్ లో శశాంక్ మోహన్, సుధాకరరెడ్డి, మునిమోహన పిళ్ళే జిల్లాల వార్తలు ప్రచురణకు తిరగరాయడంలో నిమగ్నమైవున్నారు.

ఇంతలో మేనేజర్ నుంచి నాకు ఫోన్ కాల్ “వార్తలు ముఖ్యమే కాని అవసరంమేరకే ట్రంకాల్స్ బుక్ చేయమని” సలహాలాంటి అధికారాన్ని చూపిస్తూ…(మేనేజర్లు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఇలాగే వుంటారేమో) నాకు చికాకు వచ్చి ఇంకో ఫోన్ వచ్చింది తరువాత మాట్లాడుతానని పెట్టేశా!

హైదరాబాద్ ఈనాడు సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డునుంచి వర్మగారు నాకు ఫోన్ చేసి “ఎట్టి పరిస్ధితుల్లోనూ మాస్ట్ హెడ్ (ఈనాడు లోగో) దించడానికి వీల్లేదని చెప్పు” అన్నారు. రేపు మీ ఎడిషన్ కే మార్కులు వస్తాయి బ్యేలెన్స్ మెయింటెయిన్ చేయండి అన్నారు.
మాస్ట్ హెడ్ కూడా దించవచ్చుకదా తట్టనేలేదు అంని ప్రకాష్ అంటే నవ్వుకున్నాము. అపుడు రామశేషుగారు – బ్యానర్ వార్తేగాని మాస్ట్ హెడ్ దించవలసింది కానేకాదు అని తెగేసి చెప్పారు. (ఆ ఎడిషన్ రామశేషుగారు ఇవ్వవలసింది. ప్రకాష్ బృందం ఉద్వేగాన్ని గౌరవించి వారికి బాధ్యతలు అప్పగించేసి పక్కనే వుండి మొత్తం పరిస్ధితిని ఫాలోఅవుతున్నారు.

“మహాకవి శ్రీశ్రీ మహాప్రస్ధానం” అని బ్యానర్ రాశారు.ఇది అందరికీ అర్ధమౌతుందా అని నాకు అనుమానమొచ్చంది. ఈ అనుమానాన్నే శర్మ అడిగితే “శ్రీశ్రీ గురించి తెలిసిన వాళ్ళకి ఇది అర్ధమౌతుంది” అని రామశేషుగారు రూలింగ్ యిచ్చారు.

ఈ మొత్తం ప్రక్రియలో ప్రకాష్, దాట్ల, రామశేషు గార్లదే యాక్టివ్ రోల్. డెస్క్ ఎదురగా దూరంగా వుండే ఇన్ చార్జ్ సీటులో పతంజలిగారు కూర్చుని కొవ్వోత్తి వెలుగులో ఆలోచిస్తూ రాసుకుంటున్న రూపం మెదులుతున్నట్టువుంది. మామూలుగా ఫస్ట్ ఎడిషన్ పేజీలు ఇచ్చేశాక పతంజలి వెళ్ళిపోతారు. ఆరోజు ఆయన తిరుపతి టౌన్ కి వెళ్ళారనీ(ఎడిషన్ ఆఫీస్ రేణిగుంటలో వుంటుంది) ఫలానాఫలానా చోట వుండొచ్చనీ రిపోర్టర్ వల్లీశ్వర్ గారికి ఫోన్ చేసి పతంజలిగారికి కబురందేలా చూడాలనీ ప్రకాష్ గారు నన్ను అడిగినట్టు లీలగా గుర్తుంది..లేట్ గా ఆయన వచ్చారో లేక రాలేదో ఎంత ఆలోచించినా గుర్తు రావడం లేదు అయితేవార్త మొత్తం కాపీ తయారు చేసింది దాట్లగారే! మెరుగులు దిద్దింది ప్రకాష్ గారే! తుదిమెరుగులన్నీ పతంజలిగారివేననీ, ఆయన విజయవాడ న్యూస్ ఎడిటర్ వాసుదేవరావుగారూ చాలాసార్లు ఫోన్ లో మాట్లాడుకున్నారనీ నాకు లీలగా గుర్తొస్తోంది. శర్మ మాత్రం ఆ రాత్రి పతంజలిగారు కనబడలేదని గట్టిగాచెబుతున్నారు. నేనైతే దాట్ల ముడి సరుక్కి ఉద్వేగాన్ని అద్దింది పతంజలిగారేనని గట్టిగా నమ్ముతున్నాను

విజయవాడ, విశాఖ, హైదరాబాద్, ఎడిషన్లకు కూడా తిరుపతి ఎడిషన్ వార్తే బ్యానర్ అయితే డిస్పేలు మాత్రం వేరువేరుగా వున్నాయి.

ఎడిషన్ అయిపోయాక చాలాసేపు వుండిపోయాము. టీలు సిగరెట్లూ తీసుకురావడానికి ఏకాంబరం ఆరోజు కనీసం 60/70 సార్లయినా పైకీ కిందికీ తిరిగివుంటాడు.

మూడోరోజుకల్లా చైర్మన్ గారి(రామోజీరావుగారు) కామెంట్స్ వచ్చాయి. “బాగుంది. శ్రీశ్రీ కుటుంబ వివరాలు లేవు.సామాన్యపాఠకులకు ఈ వార్త అర్ధమౌతుందా” అని పేపర్ మీద పచ్చసిరాతో ఆయన రాశారు.

వార్తకు ఒక ఫార్మేట్ వుంటుంది. దాన్నిపక్కన పెట్టి శ్రీశ్రీగారి జీవితాన్ని మరణం వరకూ ఆయన పద్యాలతోనే వివరించిన ఉద్వేగపూరితమైన ఆ కథనం అనుకుని గాక యాధృచ్చికంగా జరిగిందే. అది ఈనాడుకి మంచిపేరు తెచ్చింది. అందులో రాసినవారి ఎమోషన్ తోబాటు కవిత్వాన్ని మామూలు మనిషి ఆలోచనల్లోకి తెచ్చిన శ్రీశ్రీముద్రలో లోతులుకూడా వున్నాయి.

73 ఏళ్ళు జీవించిన శ్రీశ్రీ మరణించి ఇవాల్టికి(16/6/13 నాటికి) సరిగ్గా 30 ఏళ్ళు. ఆయన 30/40 ఏళ్ళవయసులో రచనా వ్యాసాంగం ఉధృతంగా సాగింది..ఆయన మరణించిన నాటికి పుట్టిన వారి వయసు 30 ఏళ్ళు వారిలో ఏకొందరికో శ్రీశ్రీ పేరుతెలుసు.అయన చురుగ్గా రాస్తున్న కాలంలో పుట్టిపెరిగిన నా వయసు వాళ్ళమీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో శ్రీశ్రీ ప్రభావంగట్టిగావుంది. నా ఏజ్ గ్రూప్ లో వున్న వాళ్ళలో ఒక్కసారైనా కవిత్వం రాయని వారు వుండరు. అది శ్రీశ్రీ ముద్రే! ఈ ముద్రే ఈనాడుకి “మహాకవిశ్రీశ్రీ మహాప్రస్ధానం” చాలాకాలం గొప్ప స్కోరై మిగిలింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *