వివేకం విచక్షణ పతనం! సెలబ్రెటీల మీద ప్రజలమోజు!మీడియా మొగ్గూ అటువేపే! నీతికీ పేదా పెద్దా తేడా(శనివారం నవీనమ్) 

పైకోర్టులో సల్మాన్ ఖాన్ కి శిక్ష ఖరారు కావచ్చు, నిర్దోషిగా బయటకు రావచ్చు…అన్ని సెలెబ్రెటీ కేసుల మాదిరిగానే ఈ కేసుకూడా పెద్దవాడికోన్యాయం పేదవాడికోన్యాయం అనే ధ్వంధ్వ నీతికి ఒక సాక్ష్యమై వెక్కిరిస్తూవుంటుంది.

మనిషి ప్రాణం విలువను డబ్బుతో ముడిపెట్టి చూసే పరిగణన సమాజంలో పెరిగిపోవడమే ప్రమాదకరధోరణి…డబ్బువత్తిళ్ళకు ఎదురుగా నిలచిన సల్మాన్ ప్రమాదబాధితులకు లభించవలసిన సంఘీభావంకంటే సల్మాన్ పట్ల వెల్లువౌతున్న సానుభూతే హెచ్చుగా వుండటాన్ని చూస్తే పౌరసమాజపు సెలెబ్రెటీ మోజు పట్ల ఏవగింపూ భయమూ కలుగుతాయి. పతనమౌతున్న ప్రజల వివేకం విచక్షణ ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ సందర్భంగా ఎర్రచందనం ఎన్ కౌంటర్ ప్రస్తావన కూడా అనివార్యమే..సత్యం రాజు జైలు కేసు ప్రస్తావనా అనివార్యమే. అసలు స్మగ్లర్లను పట్టుకోవడం చేతగాని చేవలేని ప్రభుత్వం, అధికారయంతా్రంగం ఆనేరంలో అట్టడుగున వున్న పేదకూలీని పట్టుకుని కాల్చి చంపితే మధ్యతరగతి విద్యావంతులు సైతం ఇదే సరైన శాస్తి అని పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. కోటానుకోట్ల నష్టంతెచ్చినవారిని ఇంకేంచేయాలని వాదించారు…అదేవిధంగా కోట్ల స్కాంలో సత్యంరాజుకి జైలు ఖరారైనపుడు ఐటివిస్తరణకి ఆయన ఎంత కృషిచేశారో ప్రముఖంగా ప్రస్తుతించి నేరతీవ్రతని తగ్గించి చూపే ప్రయత్నం చేశారు.

ఇందుకు తప్పుపట్టవలసింది ఖచ్చితంగా మీడియానే…సెలబ్రెటీల మీదే ఫోకస్ వుంచడానికి అలవాటు పడిపోయిన సమాచారసాధనాలు పబ్లిక్ ఒపీనియన్ ని రూపొందించడంలో (ఉద్దేశ్యపూర్వకంగా కాకపోయినా) ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయు. నిరుపేదల్ని విస్మరిస్తున్నాయి.

నిద్రిస్తున్న అయిదుగురు అభాగ్యులపైకి తాగిన మైకంలో కారుపోనిచ్చి ఒకరి మృతికి కారణమైనందుకు సల్మాన్ ఖాన్ క అయిదేళ్లు జైలు శిక్ష పడింది. ఆలస్యమైన న్యాయం న్యాయమే కాదు అన్నది న్యాయవ్యవస్థలో నానుడి. సల్మాన్‌ కేసులో ఇదే జరిగింది. సమాజంలో తామే ఉన్నతులమని, చట్టాలకు అతీతులమని, డబ్బుతో దేనినైనా కొనేయొచ్చని ఎగిరెగిరిపడేవారికి ఈ తీర్పు ఓ గట్టి హెచ్చరిక.

న్యాయాన్ని ప్రసాదించే వ్యవస్థ దురవస్థను కూడా ఈ కేసు మరోసారి ఎత్తిచూపింది. గతంలో బాలీవుడ్‌కే చెందిన అగ్రనటుడు సంజరు దత్‌ అక్రమంగా ఆయుధాలు కలిగివున్నాడనే కేసులో తీర్పు రావడానికి పదమూడేళ్లు పట్టింది. దత్‌ కేసులో నేర నిర్ధారణ కష్టతరమైనదే కాదు, కొంత క్లిష్టతరం కూడా. ఆయన దగ్గర ఆయుధాలున్నా, ఉగ్రవాదులతో ఆయనకు సంబంధాలున్నాయనడానికి గానీ, నేరానికి పాల్పడే ఉద్దేశంతో వాటిని సేకరించుకున్నారనడానికి కానీ ఎలాంటి ఆధారాలూ లేవు. కానీ, సల్మాన్‌ ఖాన్‌ కేసు అటువంటిది కాదు. ఈ కేసులో తప్పు ఎవరు చేశారో తెలియజేసే ఆధారాలు, సాక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయి. దీనిపై ఎప్పుడో తీర్పు వెలువడాల్సింది. కానీ, సినిమా తరహాలో ఈ కేసు కూడా అనేక మలుపులు తిరిగింది. సాక్షులు అడ్డం తిరగడం, చివరిలో ఖాన్‌ డ్రైవర్‌ తప్పుడు సాక్ష్యాలు, దర్యాప్తులో అలసత్వం వెరసి ఈ కేసులో న్యాయాన్ని జాగు చేశాయి. భారత శిక్షా స్మృతి సెక్షన్‌ 304 (2) కింద సల్మాన్‌ హత్యకు పాల్పడ్డారన్న అభియోగంతో సహా ఇతర అభియోగాలన్నీ నిజమేనని రుజువయినందున గరిష్టంగా పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశమున్నా, సెషన్స్‌ కోర్టు అయిదేళ్లు మాత్రమే శిక్ష వేసింది.

సెలబ్రిటీలు కొందరు తాము సమాజంలో ఉన్నతులమని, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటారు. మన రాష్ట్రంలోనూ సెలబ్రిటీలు, వారి పిల్లలు తప్ప తాగి కొందరు, అహంకారంతో మరి కొందరు సామాన్యులపై చేయి చేసుకోవడం, తమ పలుకుబడితో కేసులు లేకుండా చేసుకున్న ఉదంతాలను చూశాం. సల్మాన్‌ పీకలదాకా తాగి కారును అపరిమిత వేగంతో నడుపుతూ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న మురికివాడ వాసులపైకి పోనివ్వడమే కాదు, ప్రమాదంలో కాళ్లు, చేతులు పోగొట్టుకుని హాహాకారాలు చేస్తున్న బాధితులను పట్టించుకోకుండా పారిపోయాడు. ప్రమాదం జరిగినప్పుడు వాహనాన్ని ఆపి, బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లడం కనీస ధర్మం. సల్మాన్‌ దీనిని కూడా పాటించలేదు. బాధితులకు పరిహారం చెల్లించి కోర్టు వెలుపల కేసును పరిష్కరించుకోవాలని చూశాడు. డబ్బుతో దేనినైనా కొనవచ్చని అనుకున్నాడు. ఆ యత్నాలేవీ ఫలించకపోవడంతో సాక్ష్యాలను కొనేసి కేసును తిమ్మినిబమ్మిని చేయవచ్చనుకున్నాడు. డబ్బుతో న్యాయాన్ని తూకం వేయాలని చూశాడు.

హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ప్రధాన సాక్షులలో ఒకరైన ఆయన అంగరక్షకుడు, పోలీస్‌ కానిస్టేబుల్‌ రవీంద్ర పాటిల్‌ ఇచ్చిన వాంగ్మూలంలో ‘తాను ఎంత హెచ్చరించినా వినకుండా సల్మాన్‌ఖాన్‌ హైస్పీడ్‌లో కారు నడిపారని’ పేర్కొన్నాడు. ఇందుకుగాను ఆయన భారీ మూల్యాన్నే చెల్లించుకున్నాడు. డిపార్టుమెంట్‌ నుంచి తీవ్ర వేధింపులు, మానసిక ఒత్తిళ్లు పెరిగాయి. చివరికి 2007లో అనారోగ్యంతో అతడు మరణించాడు. ఈ కేసులో రెండవ సాక్షి ఖాన్‌ కారు డ్రైవరు. అతడు చేయని నేరాన్ని తన నెత్తిన వేసుకునేందుకు సిద్ధపడ్డాడు. అదీ, నేరం జరిగిన పన్నెండేళ్ల తరువాత. కారు తానే నడిపానని డ్రైవర్‌ అప్పుడు చెప్పకుండా ఇప్పుడే ఎందుకు చెబుతున్నారని ప్రశ్నిస్తే అటు నుంచి సమాధానం లేదు.

ఇంకొకవైపు ఈ కేసుపై విచారణ సజావుగా సాగనివ్వకుండా నీరుగార్చేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. మొదట సెషన్స్‌ కోర్టు ఐపిసి, సెక్షన్‌ 304(2) కింద సల్మాన్‌పై కేసు నమోదు చేయగా, తరువాత బొంబాయి హైకోర్టుకు, అటుపిమ్మట సుప్రీం కోర్టుకు సల్మాన్‌ వెళ్లాడు. ఈ తతంగమంతా ఒక దశాబ్దం పాటు సాగింది. చివరికి అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ దీనిని సెషన్స్‌ కోర్టుకు నివేదించారు. సెషన్స్‌ కోర్టు రెండేళ్లకు పైగా దీనిపై విచారణ సాగించి చివరికి సల్మాన్‌ను దోషిగా తేల్చింది. దీనిపై సల్మాన్‌ తాజాగా సుప్రీం కోర్టునాశ్రయించాడు.

గతంలో అంటే 2006లో ఏడుగురు కూలీల మృతికి కారణమైన ఆలిస్టర్‌ పెరీరాకు మూడేళ్లు జైలు శిక్ష మాత్రమే పడింది. దీనిపై అతను సుప్రీం కోర్టుకెళ్లగా ఈ శిక్ష చాలా తక్కువని సర్వోన్నత న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. అయినా, దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం అప్పీలు చేయడానికి సిద్ధపడలేదు. ఈ కేసులో బాధితులు పేదవాళ్లు కాబట్టి దీనిని ఉపేక్షించింది.

ఇప్పుడీ కేసులో సుప్రీం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఖాన్‌ ఈ ఒక్క కేసులోనే కాదు ఇంకా చాలా వివాదాల్లో ఉన్నాడు. షారూక్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ పుట్టిన రోజు విందులో వివేక్‌ ఒబెరారును బెదిరించిన కేసులో నిందితుడు. అలాగే 2006లో ఐశ్వర్యారారు వేధింపుల కేసులో ఉన్నాడు. రాజస్థాన్‌లోని కృష్ణ జింకలను వేటాడిన కేసులో నిందితుడు.

కొద్ది సంవత్సరాల క్రితం వరకూ బాలీవుడ్‌ బ్యాడ్‌ బాయ్ గా ముద్రపడిన సల్మాన్‌ ఆ తరువాత హ్యూమన్‌ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి పిల్లలకు సాయం అందిస్తూ మంచి మనిషిగా ఇమేజి సంపాదించేందుకు ప్రయత్నించాడు.

అంతమాత్రాన, గతంలో చేసిన పాపాలు మాసిపోవు. నేరానికి శిక్ష అనుభవించాల్సిందే!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *