రియల్ ఎస్టేటూ – వడగాలీ 

రియల్ ఎస్టేటు వ్యాపారమే ప్రధాన ఆర్ధిక కలాపమైపోవడమంటే నేలవేడిపెంచి మనుషుల్ని చంపెయ్యడమే! ఇపుడు జరుగుతున్నది అదే!! భూమిని కొని ప్లాటులుగా మార్చి అమ్మేవారు అందులో పచ్చదనపు నిష్పత్తిని పాటించకపోతే కనీసం ఏడుసంవత్సరాల జైలుశిక్ష వేసేలా కఠిన చట్టాలు తెచ్చి అమలు చేస్తేనే భావితరాల వారని వడగాలి మరణాలనుంచి తప్పించవచ్చు.

భారత దేశాన్ని, అందునా దక్షిణ భారతాన్ని, అందులోనూ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వేడి గాలులు పట్టి ఊపేస్తున్నాయి. గత వారం రోజుల్లోనే వెయ్యికి పైగా ప్రజలు వడగాలులకు బలైపోగా మొత్తం మీద ఈ వేసవి కాలంలో వడదెబ్బకు గురై మరణించినవారి సంఖ్య 1100 దాటి పోయిందని జాతీయ, అంతర్జాతీయ పత్రికలు తెలిపాయి. దాదాపు ప్రతి అంతర్జాతీయ వార్తా సంస్ధ భారత దేశంలో వేడి గాలుల గురించి గత కొద్ది రోజులుగా తప్పనిసరిగా వార్తలు ప్రచురిస్తున్నాయంటే దేశంలో ఎండల తీవ్రతను అంచనా వేయవచ్చు.

వాతావరణంలో వస్తున్న పెను మార్పుల మరో రూపమే ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న వడగాల్పులు అని సెంటర్‌ ఫర్‌ సైన్స్ అండ్‌ ఎన్విరాన్మెంట్‌ (సి యస్‌ ఇ)గుర్తించింది. ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా మృతి చెందిన వారిలో 60 శాతం మంది తెలుగు రాషా్టల్రల్లోనే వుండటం ఆందోళననీ, ఆశ్చర్యాన్నీకలిగిస్తున్నది.
గత మూడు దశాబ్దాల సగటు కన్నా ఐదు డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రత వుంటే ఆ రోజును వడగాల్పు రోజుగా ప్రకటించ వచ్చని సి యస్‌ ఇ వివరించింది.

వేడి గాలులకు గురై మరణించినవారందరూ పేదలే. ప్రకృతి ప్రకోపాన్ని తట్టుకుని బతకాలంటే వివిధ సౌకర్యాలు అందుబాటులో ఉంటే తప్ప సాధ్యం కాదు. ఎ.సిలు, వాటర్ కూలర్లు ఇప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉండేవి కాదు. శక్తివంతమైన ఎ.సి మిషన్లు కూడా తీవ్ర వేడి వాతావరణం మధ్య గదుల్ని చల్లగా ఉంచడంలో విఫలం అవుతున్నాయి. వాటర్ కూలర్లు తిరిగి వేడి గాలినే వినియోగదారుల మీదికి మళ్లిస్తున్న పరిస్ధితి. పైగా వాటర్ కూలర్లు తగిన ఫలితం ఇవ్వాలంటే కాస్త విశాలమైన చోటు ఉండవలసిందే.

నివాసానికి వీలయిన చోట్లన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల లాభ దాహం రీత్యా అందనంత ఎత్తుకు చేరడంతో కొద్ది చోటులోనే చిన్న చిన్న ఇళ్ళు పక్కపక్కనే, ఇరుకుగా కట్టుకోవాల్సిన పరిస్ధితి నెలకొని ఉంది. ఇలాంటి క్రిక్కిరిసిన చోటుల్లో వాటర్ కూలర్లు పనిచేయకపోగా మరింత ఉడుకు వాతావరణాన్ని సృష్టిస్తాయి, వాటర్ కూలర్ లేకపోతేనే నయం అనుకునేంతగా! ఈ పరిస్ధితుల్లో ఆదాయంలో అత్యధిక భాగం తిండికి, నివాసానికి, రోగాలకు ఖర్చైపోగా ఎ.సి మిషన్లు కొనుక్కోగల స్తోమత పేదవారికి లభించే అవకాశమే లేదు.

అందువల్ల మృతుల్లో అత్యధికులు నడి ఎండల్లో సైతం పని చేయక తప్పని పరిస్ధితిని ఎదుర్కొనే నిర్మాణ కార్మికులు, ఇళ్ళు లేక నీటి తూముల్లో, చెట్ల కింద, పేవ్ మెంట్ల పైన నివసించే కడు పేదలే ఎక్కువగా ఉన్నారని ప్రభుత్వ లెక్కల్లో తెలుస్తున్న చేదు వాస్తవం. పేద వర్గాలలో కూడా చిన్న పిల్లలు, వయసు పైబడిన వాళ్ళు, కొన్నిచోట్ల స్త్రీలు ఎక్కువగా ఎండవాత పడి మరణిస్తున్నారు. పల్లెల్లో వ్యవసాయ కూలీల మరణాలు అసలు లెక్కలోకే రాని పరిస్ధితి! ప్రకృతి ప్రకోపానికి కూడా వర్గ దృష్టి ఉన్నదని దేశంలో సంభవిస్తున్న వేడి గాలుల స్పష్టం చేస్తున్నాయి.

ముఖ్యంగా నగర ప్రాంతాలల్లో చెట్ల సంఖ్య తగ్గిపోవడం, కాంక్రేట్‌ భవనాలు పెరిగి పోవడం తో ఇటు వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి.ఈ ప్రభావంతో వాస్తవ ఉష్ణోగ్రత కన్నా 3 నుండి 4 డిగ్రీలు అదనంగా ఉన్నట్లు భావిస్తామని సి యస్‌ ఇ వాతావరణ మార్పు కార్యక్రమ మేనేజర్‌ అర్జున శ్రీనిధి తెలిపారు. 2010లో కన్నా ఈ సంవత్సరం వడగాల్పుల కాలం చాల తక్కువగా ఉన్నదని, అయినా మృతుల సంఖ్య చాల ఎక్కువగా ఉన్నదని ఆయన గుర్తు చేసారు. ఫిబ్రవరి, మార్చ్ లలో వాతావరణం తడిగా ఉంది, అకస్మాత్తుగా మార్పు రావడం వల్లనే ఈ విధంగా జరిగినదని ఆయన పేర్కొన్నారు.మానవ ప్రేరేపిత ప్రపంచ ఉష్ణోగ్రత 2014 సంవత్సరాన్ని అత్యధిగా వేడి ఉన్న సంవత్సరంగా మార్చిందన్నారు.

అందుకనే దీనిని అత్యంత వేడి దశాబ్దంగా పేర్కొనవచ్చు. గత పదేళ్ళలో ప్రపంచ ఉష్ణోగ్రత సగటున 8 డిగ్రీలు పెరగడంతో మరింత తీవ్రంగా పెరిగే అవకాశం ఉంటుందని సి యస్‌ ఇ పరిశోధకులు హెచ్చరించారు. రాతప్రూట ఉష్ణోగ్రతలు సహితం పెరుగుతున్నాయని అన్నారు. ఇటీవల ఢిల్లీ, అహ్మదాబాద్‌ లలో రాత్రిపూట 39 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడం గమనార్హం. ప్రతి సంవత్సరం వడగాల్పుల రోజులు 5 నుండి 30 నుండి 40 వరకు పెరిగే అవకాశం ఉన్నాదని వీరు హెచ్చరించారు. ఇటువంటి ఉపద్రవాలు జరిగినప్పుడు మృతుల కుటుంబాలకు కొంత ఆర్ధిక సహాయం ప్రకటించి ప్రభుత్వాలు తమ బాధ్యతలను సరిపుచ్చు కోవడం పరిపాటి అవుతున్నది. తక్షణం అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించడం, ప్రత్యెక వైద్య బృందాలను ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతాలల్లో ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు చూడాలి.

ఇటువంటి ఉష్ణోగ్రతలను తట్టుకొనే విధంగా ప్రజానీకం ఎటువంటి ముందు జాగ్రతలు తీసుకోవాలో విస్తృతంగా ప్రచారం చేయవలసి ఉంది. పగటి పుట ఇండ్లల్లో నుండి బైటకు రావద్దని హెచ్చరించి జిల్లా అధికారులు తమ బాధ్యతలు తీరాయని అనుకొంటే సరిపోదు. పనుల కోసం, ఉపాధి కోసం బైటకు రాక తప్పదు.

పెద్ద ఎత్తున మజ్జిగ సరఫరా కేంద్రాలు ఏర్పాటు చేయడం చేయవచ్చు. ఈ విషయమై ఈ సంవత్సరం ఎవ్వరూ పెద్దగా ఆసక్తి కనబరచిన్నట్లు లేదు. హైదరాబాద్‌ నగరంలో హోం గార్‌‌డ లకు పగటి పుట డ్యూటీలు వేయకుండా నిర్ణయం తీసుకోవడం హర్షణీయం.
తాత్కాకాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక ప్రభావం చూపే చర్యల పట్ల దృష్టి సారించాలి. నగరాల్లో తగ్గుతున్న గ్రీనరి పట్ల దృష్టి సారించాలి. పెద్ద ఎత్తున మొక్కలు నాటే ప్రయత్నం చేయాలి.

ప్రతి సంవత్సరం వేసవి అనంతరం వర్షాలు పడగానే లక్షల సంఖ్యలో మొక్కలు నాటుతున్నామని వనమోహత్సవాలు జరుపుతున్నా ప్రభావం కనబడటం లేదు. నాటిన మొక్కల గతి గురించి ఎప్పుడైనా ఆడిట్‌ నిర్వహించారా ? వాటి గతి ఎమవుతున్నదో ఎప్పుడైనా సమీక్ష జరిపారా ?
వాతావరణ మార్పుకు అనువుగా భవనాల డిజైన్‌ మార్చడం, ప్రజల్లో అవగాహన కలిగించి తట్టుకొనే విధంగా సమాయత్త పరచడం కోసం ఈ సందర్భంగా ప్రభుత్వాలు దీర్ఘకాలిక ప్రణాలికలను రూపొందించు కోవాలి. పట్టణ ప్రణాళిక విభాగంలోనే పర్యవణ విభాగం సైతం ఏర్పాటు చేసి, అందుకు విశేష ప్రాధాన్యత ఇవ్వాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *