అంతగా కీర్తించబడని దివంగత ప్రధాని, మేధావి, నిస్వార్ధ రాజకీయవేత్త, నిరాడంబరుడు, “ఏరుదాటాక కాంగ్రెస్ పార్టీ తగలబెట్టిన తెప్ప” పాములపర్తి వేంకట నరసింహారావు గారి జయంతి (28/9/13) ఈరోజే.
పదవులను సమాజహితం కోసం ఉపయోగించడంలో, పాములపర్తివేంకటనరసింహారావుముందుండేవారు.ముఖ్యమంత్రిగా కొద్దికాలమే ఉన్నా తనకున్న పరిమితులతో సుపరిపాలనను అందించారు. 1972లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికల్లో 70శాతం సీట్లను వెనుకబడిన తరగుతల వారికి ఇచ్చి చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రిగా భూసంస్కరణల అమలుకు కఠిన చర్యలు తీసుకున్నారు. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం కూడా పీవీ ప్రవేశపెట్టిందే. పెద్దరైతులు ఆదుగ్ధతోనే పివిని దించేయడానికి జై ఆంధ్రా ఉద్యమాన్ని వాడుకున్నారన్న విశ్లేషణ ఇప్పికీ వినిపిస్తూనే వుంటుంది
ప్రధాని హోదాలో పీవీ తీసుకున్న ఆర్థిక సంస్కరణల అమలు నిర్ణయం.. భారత సమాజాన్ని యావత్ ప్రపంచానికి దగ్గర చేసింది. 1991కాలంలోనే ఆయన కంప్యూటర్ వాడకంలో నిష్ణాతుడిగా ఉండేవాడు. అల్లకల్లోలంగా ఉన్న పంజాబ్ లో తీవ్రవాదాన్ని అణిచివేసి శాంతిని స్థాపించడంతో పాటు మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు నడిపిన ఘనత కూడా పీవీదే. ఆర్థిక వేత్తగా ఉన్న మన్మోహన్ సింగ్ ను రాజకీయాల్లోకి తెచ్చి ఆర్థికమంత్రిని చేసిన ఘనత కూడా పీవీదే. అలా ఆయన చూపిన బాటలో సాగిన మన్మోహన్ ప్రధాని స్థాయికి చేరుకున్నారు.
పీవీ నరసింహారావు.. వరంగల్ జిల్లా.. నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. 1921 జూన్ 28న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు జన్మించిన పీవీ. వరంగల్ జిల్లాలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. తర్వాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు ఆయన్ను దత్తత తీసుకున్నారు. అప్పటినుంచే ఆయన ఇంటిపేరు పాములపర్తిగా మారింది.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై 1938లో అంటే తన 17వ ఏటే కాంగ్రెస్ లో చేరారు. డిగ్రీ చదువుతున్న సమయంలో నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని ఆలపించడం వల్ల ఉస్మానియా వర్శిటీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. దీంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి 1944వరకు ఎల్ ఎల్ బీ చదివారు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావుల అనుయాయిగా స్వాతంత్ర్యోద్యమంలోనూ హైదరాబాద్ విముక్తి పోరాటంలోనూ పీవీ పాల్గొన్నారు.
బూర్గుల రామకృష్ణారావు శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరిన పీవీ.. నాటి యువ కాంగ్రెస్ నాయకులు మర్రి చెన్నారెడ్డి, చవాన్, వీరేంద్ర పాటిల్ తదితరులతో కలిసి పని చేశారు. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యత్వం పొందారు. 1957లో మంథని నుంచి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1962లో తొలిసారి మంత్రి అయ్యారు.
1962 నుంచి 1971వరకు న్యాయ, సమాచార, దేవాదాయ, వైద్య ఆరోగ్య శాఖల మంత్రిగా పనిచేశారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చల్లారిన తర్వాత.. ఈ ప్రాంతానికి చెందిన గ్రూపు రాజకీయాలకు అతీతుడైన పీవీని కాంగ్రెస్ అధిష్ఠానం.. 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. తర్వాత కొంత కాలానికే రాజకీయ కారణాల వల్ల పీవీ ప్రభుత్వం రద్దైంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన తర్వాత ఆయన రాజకీయ కార్యకలాపాలు ఢిల్లీకి మారాయి. మొదటిసారి హన్మకొండ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.
రెండోసారీ అక్కడి నుంచే గెలిచారు. మూడోసారి మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి విజయం సాధించారు. 1980-89మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశీ వ్యవహారాలు, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రిగా కొనసాగారు. 1991సార్వత్రిక ఎన్నికల నాటికి దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్న పీవీని.. అనుకోకుండా ప్రధానమంత్రి పదవి వరించింది. రాజీవ్ గాంధీ హత్యతో.. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులకు అతీతుడిగా ఉన్న పీవీని ప్రధానిగా ఎన్నుకున్నారు.
సాహిత్య పరంగా కూడా పీవీ సమాజానికి తన సేవలను అందించారు. దాదాపు 16భాషల్లో అనర్గళంగా మాట్లాడగలగడమే కాకుండా ఆయా భాషల్లోని సాహిత్యంతో పీవీకి పరిచయం ఉండేది. విశ్వనాథ రాసిన వేయిపడగలు రచనను హిందీలో సహస్రఫణ్ పేరిట అనువదించారు. దీనికిగాను ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఇన్ సైడర్ పేరిట తన జీవిత కథను రాసుకున్నారు. పీవీ నరసింహారావు జీవితంలో కొన్ని మరకలున్నా.. భూ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, బీసీలకు రాజకీయావకాశాలు కల్పించడం ద్వారా సమాజానికి తన వంతు విశిష్ట సేవలు అందించారు. ఎందరికో మార్గదర్శకంగా నిలిచారు.
ఆధునిక భారత రూపశిల్పి, భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు, పాములపర్తి వేంకట నరసింహారావు. వింధ్య పర్వత శ్రేణుల దిగువనుంచి భారత ప్రధాని స్థాయికి ఎదిగిన ఏకైక రాజనీతి కోవిదుడు. వంగర గ్రామం నుంచి ఢిల్లీ దర్బారు దాకా ఎదిగిన ఈ నిరాడంబర మేధావి.
సంస్కరణల గురించి ఘనంగా చెప్పుకునే కాంగ్రెస్ అందుకు ఆద్యుడైన పివిని ఉద్దేశ్యపూర్వకంగానే విస్మరించంది. దేశరాజధానిలో ప్రధానులకు జరిగే అంత్యక్రియల ఆనవాయితీ సోనియా కు నచ్చనికారణంగా పివి విషయంలో తప్పిపోయింది.