నిన్నొక డేటాగా మార్చేసి, నీ ఉనికిని నీకే అమ్మే నావిగేటరు(ఇదేదో భయంగా వుందే!)

ఎక్కడికి వెళ్ళాలో చిరునామా చెబితేచాలు…అదే క్షణాల్లో వెతికేసి అన్నిదారులనూ దూరాలనూ, సుమారుగా చేరేసమయాలనూ కళ్ళముందు పరుస్తుంది. ఏదో ఒకదారి ఎంపిక చేసుకుని బయలు దేరడమే తరువాయి…రెండొందల మీటర్లలో ఎడమకి తిరగాలి…ఎనిమిది వందల మీటర్లు నేరుగా వెళ్ళాలి…వచ్చే సర్కిల్ లో మూడో రోడ్డులో ఎగ్జిట్ అవ్వాలి…ఇలా ముందస్తు సూచనలు ఇస్తూ గమ్యానికి చేరుస్తుంది.

వన్వేల నగరంలో వెనుకవాహనానికి ఇబ్బంది లేని చోటుని వెతుక్కోవడమే కష్టం…ఓ ఖాళీ చోట్లో కారు ఆపి అడ్రస్ అడుగుదామంటే వెసులుబాటున్న మనుషులు దొరకడం మరీ కష్టం…ఎవరో కష్టపడి చెప్పినా అది బుర్రకెక్కడం కనా కష్టం. ఇన్ని కషా్టల మధ్య పదికిలోమీటర్ల ప్రయాణానికే రెండు గంటలు పడితే తొందరగా చేరుకున్నట్టే .

మనిషికి ఉపయోగపడటానికే సమాచార సాంకేతిక పరిజ్ఞానం అనుకోవడం బాగుంది. Map My India అన్నపేరుకూడా కొంత దేశభక్తి పూర్వకంగానే వున్నట్టుంది. సెల్ నెట్వర్కులతో సంబంధంలేని గ్లోబల్ పోజిషనింగ్ సిస్టమట…ఆకాశం గొడుగుకిందనువ్వెక్కడున్నా నిన్ను చూసేసి, నిన్నొక డేటాగా మార్చేసి, నీ ఉనికిని నీకే అమ్మే నావిగేటరట… 

ప్రయాణం సాగినంత సేపూ దారిచూపడానికి ఇది నేను కొనుక్కున్న బానిన అని సంబరమనిపించినా, నిన్నూ-నన్నూ తదేకంగా చూస్తున్న యాంత్రిక నేత్రాలంటే భయమేస్తూంది. అంతరిక్షం నుంచి నాసా కన్ను…ఇంటర్నెట్ అంతటా గూగుల్ కన్ను…కూడలి ప్రాంతాల్లో ఖాకీ కన్ను, అంగళ్ళలో వ్యాపారుల కన్ను…నీ గుప్పెట్లో సెల్ ఫోన్ కన్ను…కనుచూపు మేరంతా రెప్పలార్పని ఎలకా్ట్రనిక్ కన్ను…

ఇన్ని కళ్ళు చూసే వాటిలో రియాల్టీ షోలు కొన్ని లైవ్ టెలికాస్టులే అన్నీ…దారిచూపించే కంటికి నీతి లేకపోతే ఆదమరచిన సెలబ్రెటీ బట్టలు వోలిచేస్తుంది. నమ్మిన ప్రియురాల్ని దిగంబరంగా నెట్ లో పెట్టేస్తుంది… సరే! ఎలాగోలా ఈ కళ్ళను మాయచేయవచ్చు…హరించబడిన ప్రయివెసీని తుడిచి పెట్టవచ్చు!!

ఈ అక్షరాలు, ఫోటోలు, వీడియోలు, ఫోన్ లో మాట్లాడిన మాటలు, ఇలాంటి డేటాను మనం డిలిట్ చేసేయవచ్చు. అసలు మన అడౌంట్లను మనమే ధ్వంసం చేసుకోవచ్చు…..

అయినా ఆ డేటా అంతా వేర్వేరు సర్వర్లలో అలాగే వుండిపోతుంది.

అర్ధం కాలేదా? అలా పోగులు పడిపోయిన డేటాను క్రోడీకరించి, సెర్చ్ ఇంజన్లు గుర్తించ డానికి పేర్లు పెట్టి క్షణాల్లో మనం అడిగింది చూపిస్తున్న గూగుల్ మన  అనుభవమే కదా?

గూగుల్ లాంటి మహా మహా సర్వర్లు దాచివుంచుతున్న డేటా నీటి సముద్రాలకు మించిన డేటా సాగరాలైపోతూండటం….కంటికి కనిపించని డేటా నిక్షేపాల పై హక్కులెవరివి? ఎవరు డేటాను నిర్వహిచాలి? మహా సర్వర్ల యాజమాన్యాలే డేటాను సొంతం చేసేసుకుంటే వాటి సృష్టికర్తలైన మనుషుల సృజన కు ఈ టెక్నాలజీ ముందు పేటెంటు హక్కులు నిలుస్తాయా? మొదలైన ప్రశ్నలకు సమాధానాలు లేవు!

అంతెందుకు నేను రాసిన ఈ డిజిటల్ అక్షరాల మీద హక్కు నాదేనా! మీరూ, నేనూ డిలిట్ చేశాక కూడా డేటా వుండిపోయిన సర్వర్ల నిర్వాహకులవా?  

 
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *