ధర రాదు అప్పుతీరదు యూరప్ రైతులదీ అదే కథ!

జీవన వ్యాపకాల్లో మౌలికమైన మార్పులు వచ్చినపుడు తలఎత్తే సంక్షోభాలు వ్యవస్ధాగతమైన ఆత్మహత్యలుగా మారిపోతున్నాయని ప్రపంచఅనుభవాలు రుజువు చేస్తూనే వున్నాయి. నివారణలకు ప్రత్యామ్నాయాలను కనుగొనడంలో ప్రభుత్వాలు విఫలమౌతూనే వున్నాయి. ఏ ఆర్ధిక సంక్లిష్టతకైనా మొదటి వేటు వేస్తున్నది వ్యవసాయరంగం మీదే!

ధరలు పడిపోయి, ఉత్పత్తులు మురిగిపోతున్న 28 యూరప్ దేశాల వ్యవసాయ సంక్షోభాన్ని నివారింరించి రైతులను ఆదుకునే తక్షణ చర్యలకోసం యూరోపియన్ యూనియన్ 500 మిలియన్ల యూరోలను విడుదల చేసింది. జీవన వ్యాపకాల్లో మౌలికమైన మార్పులు వచ్చినపుడు తలఎత్తే సంక్షోభాలు వ్యవస్ధాగతమైన ఆత్మహత్యలుగా మారిపోతున్నాయని ప్రపంచఅనుభవాలు రుజువు చేస్తూనే వున్నాయి. నివారణలకు ప్రత్యామ్నాయాలను కనుగొనడంలో ప్రభుత్వాలు విఫలమౌతూనే వున్నాయి. ఏ ఆర్ధిక సంక్లిష్టతకైనా మొదటి వేటు వేస్తున్నది వ్యవసాయరంగం మీదే! పారిశ్రామిక విప్లవం వల్ల రైతు ఆత్మహత్యలు యూరప్ లో మొదలై దాదాపు రెండు వందల ఏళ్ళు సాగాయి. పట్టణీకరణ వల్ల భారత్ లో వ్యవసాయ క్షీణత అర్ధశతాబ్దానికి పైగా ఆగక సాగింది. గ్లోబలీకరణ విషం పత్తిపైరులో మొదలై అన్ని పంటలకూ విస్తరించిన ఫలితంగా ఇరవై ఏళ్ళక్రితం మొదలైన ఆత్మహత్యలు విస్తరిస్తూ గిరిజన రైతుల్ని కూడా వదిలిపెట్టడంలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం, ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పు మొదలైన కారణాల వల్ల యూరప్ లో రైతుల కష్టాలు మొదలయ్యాయి. వ్యవసాయోత్పత్తుల ధరలు వేగంగా క్షీణిస్తున్న నేపథ్యంలో తమ ఇబ్బందులను పరిష్కరించుకోవడానికి అత్యవసరంగా నిధులు కావాలంటూ వేలాది మంది యురోపియన్‌ రైతులు బ్రస్సెల్స్‌లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ట్రాక్టర్లతో వీధుల్లో ప్రదర్శనలు చేశారు.. బెల్జియం, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాల వ్యవసాయదారులు ఈ ఆందోళన, నిరసనల్లో పాల్గొన్నారని న్యూస్ ఏజెన్సీలు వివరిస్తున్నాయి.. ప్రజల ఆహారపు అలవాట్లు మారుతుండడం, చైనా డిమాండ్‌ మందగించడం, ఉక్రెయిన్‌ అంశంపై ఆంక్షలు విధించినందుకు నిరసనగా పశ్చిమ దేశాల ఉత్పత్తులపై రష్యా నిషేధం విధించడం మొదలైన కారణాల వల్ల గొడ్డు మాంసం, పంది మాంసం, పాలు ధరలు దారుణంగా క్షీణించాయి. దీంతో యురోపియన్‌ మిల్క్‌ బోర్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రైతులు ‘పాలల్లో మునిగిపోతున్న యూరప్‌’ అంటూ పెద్ద పెద్ద బ్యానర్లు ప్రదర్శించారు. ఫ్రాన్స్‌లో దాదాపు 10 నుంచి 15 శాతం పొలాలపై రుణాలు ఒక బిలియన్‌ యూరోలకు మించిపోవడంతో అవన్నీ దాదాపు దివాళా తీసే స్థితిలో వున్నాయని ఫ్రాన్స్‌ వ్యవసాయ మంత్రి అంచనా వేశారు. ప్రధానంగా పాల ధరలపై 28 దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశంలో దృష్టి కేంద్రీకరించనున్నారు. అలాగే రష్యా విధించిన నిషేధంపై కూడా చర్చించనున్నారు. ఇతర మార్కెట్లలో అవకాశాలను కల్పించడం ద్వారా రైతాంగానికి మెరుగైన పరిస్థితి కల్పించేందుకు రాజకీయ నేతలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని ఐరిష్‌ రైతాంగ సమాఖ్య సూచించింది. ధరలు ఇక ఇంతకంటే దిగజారబోవని మార్కెట్లకు రాజకీయ వ్యవస్థ ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వాలని డిమాండ్ చేసింది. చైనా, అమెరికా మార్కెట్లకు వేలాది టన్నుల గొడ్డు మాంసం పంపిస్తామని హామీలు ఇచ్చారని, కానీ వాస్తవానికి పరిస్థితి భిన్నంగా వుందని, చాలా కొద్ది మొత్తంలో మాత్రమే అక్కడి మార్కెట్లకు తరలిందని సమాఖ్య వివరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *