తూర్పుకోస్తా ప్రయాణానికి గోదావరి అడ్డుపడినప్పుడు మౌనంగా వీపున మోసిన హేవలాక్ వంతెన ఐదుతరాల కథకుఅసలైన హీరో!

కమ్మరి సూరన్న కొలిమిలో తయారైన కత్తి మంగలి నూకరాజు చేతిలో మెత్తగా మారి చినకాపు పాపారావు గెడ్డం గీస్తున్న సమయంలో పాపారావు మేనల్లుడు సుందర్ చేతిలోకి రేజర్ తోసహా సెవెన్ ఓ క్లాక్ బ్లేడు వచ్చేసింది…

మెత్తగా కాళ్ళను వత్తుతున్న చెప్పుల అనుభవంతో వెంకడి పనితనాన్ని స్టాఫంతటికీ తరచు రికమెండు చేస్తూండే హెడ్మాష్టర్ దక్షిణామూర్తి కాళ్ళు ఓరోజు నిగనిగలాడుతున్న నల్లబూటుల్లోకి దూరిపోయాయి.

టకప్పులు, మెటల్ బొత్తాలు, సిల్కు చొక్కాలు, ట్వీడ్ పాంటులు…ఇలా మనుషుల వేషభాషలు …ఆలోచనలు… దృక్పధాలు… రూపాంతరం చెందడంలో “హేవలాక్” వంతెన పాత్ర 5 తరాలపాటు గాఢంగా వుంది.

సోషల్ ఇంజనీరింగ్ ను ఈ వారధి మౌలికంగా మార్చేసింది. జాతీయభావాన్నీ అభ్యుదయాన్ని సంస్కరణనూ మనుషుల మధ్య బదిలీ చేసిందికూడా ఈ వంతెనే!

అదే పనిగా రుద్ది రుద్ది కొండలనే కరగించి ఇసుకగా మార్చడానికి నదికి వేల సంవత్సరాలు పడితే, ఆంగ్లేయుల హిందూదేశపు ముఖ్యపట్టణం కలకత్తా, తూర్పుకోస్తాలో చెన్నపట్టణం మధ్య ప్రత్యక్షంగా, – ఉత్తరాది, దక్షిణాదుల మధ్య పరోక్షంగా అనేక మార్పులను బట్వాడా చేయడానికి “హేవలాక్” వంతెనకు ఐదు తరాలు పట్టింది.

గోదావరి మీద కొవ్వూరు రాజమండ్రిల మధ్య జవసత్వాలుడిగిన మొదటివంతెనను ఒక స్మారకంగా కాపాడాలన్న ప్రజా ఉద్యమం మొదలౌతున్న నేపధ్యంలో చారిత్రక వాస్తవాలు విశ్లేషిస్తే ఈ వంతెన రవాణా ఉపకరణంగా కంటే ప్రజలజీవితాల్లో పెనుమార్పుల వారధిగానే చివరివరకూ ఉపయోగపడిందని స్పష్టమౌతోంది.

1887 లో నిర్మాణం మొదలై ఇరవయ్యో శతాబ్దం మొదట్లో అంటే 1900 సంవత్సరంలో ప్రారంభమైంది.

న్యూస్ ఛానళ్ళూ మొబైల్ ఫోన్లూ లేని ఆరోజుల్లో ఈ వంతెన ద్వారానే పారిశ్రామిక విప్లవ అనంతర యూరప్ పరిణామాలూ, భారతదేశంలో స్వాతంత్రోద్యమ భావాలు, సాంఘిక సంస్కరణలు బట్వాడాఅయ్యాయి.

19 శతాబ్దంలో (1800 – 1900 సంవత్సరాలమధ్య ) బ్రిటీషర్లు మనదేశంనుంచి చవకగావస్తువులను కొని యూరప్ లోలాభసాటిగా అమ్ముకునే వ్యాపారం చేసేవారు. అందుకు పరిమితమైన వసతులు ఏర్పాటు చేసుకోవడం మినహా ఆకాలంలో పెద్దగా మనదేశంలో మౌలికవసతులు ఏర్పాటుకాలేదు.

ఇంగ్లండులో పారిశ్రామిక విప్లవ ఫలితంగా వస్తూత్పత్తి విపరీతంగా పెరిగిపోవడంతో వాటిని అమ్ముకోడానికి భారతదేశం పెద్ద మార్కెట్ గా కనబడింది. దేశవ్యాప్తంగా పెద్దనదులపై వంతెనలు కట్టాలని 1896 లో బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణయించి పనులు మొదలుపెట్టింది. 1900 సంవత్సరంలో దేశమంతటా ఒకేసారి 31 భారీవంతెనలు ప్రారంభంకాగా , అందులో హేవలాక్ వంతెన ఒకటి. ఈ వారధులన్నీ కలసి అప్పటివరకూ ఎగుమతులదేశంగా వున్న భారతదేశాన్ని దిగుమతుల దేశంగా మార్చేశాయి.

మా తాత పెద్దాడ పేర్రాజు గారు(1873-1948) హయాంలో సిల్కు చొక్కా ట్వీడ్ ఫాంటు క్లాతింగ్ కి బొంబాయి వెళ్ళవలసి వచ్చేదని చెప్పేవారని అవేగుడ్డలు 1930 ల్లోనే నిడదవోలు భీమవరం తాడేపల్లిగూడెం లాంటి పట్టణాల్లో దొరికేవనీ రెండు అణాలకు సిల్కు చొక్కా, మూడున్నర అణాలకు ట్వీడ్ ఫాంటు కొనుక్కున్న అనుభవాన్ని మానాన్నపెద్దాడరామచంద్రరావు గారు (1911-1997)
చెప్పారు.

వంతెనల వల్ల రైళ్ళు హోల్ సేల్ వ్యాపార కేంద్రాలనీ, ఆకేంద్రాల నుంచి కాల్వల వల్ల గూడుపడవలు రిటైల్ వ్యాపారాన్నీ పెంచాయి. ఈ విధంగా 20 శతాబ్దం కన్సూమరిజం వ్యాప్తితోనే మొదలైంది. విద్యావ్యాప్తి కూడాజరిగింది .ఇది మన సోషల్ ఇంజనీరింగ్ ను మార్చేసింది.

హౌరానుంచి మద్రాసుకి వస్తువులతోపాటే కొత్త ఆలోచనలూ రవాణా అయ్యాయి. రైలుప్రయాణాలంత వేగంగా రాజకీయాలు ఊపందుకున్నాయి. జాతీయోద్యమంలో ఉరూవాడా సభలు సమావేశాలు పెరగడానికి ఈ వంతెన ప్రముఖ సదుపాయమయ్యంది. కందుకూరి వీరేశలింగం చిలకమర్తి లక్ష్మీ నరశింహం వంటి నాయకుల సంస్కరణ భావాలు, జాతీయ లక్ష్యాలు తూర్పుకోస్తాఅంతటా ప్రభావం చూపించాయంటే గోదావరిదాటి ఎక్కడికైనా వేగంగా వెళ్ళిపోడానికి వీపుపరచిన హేవలాక్ వంతెనే ముఖ్యకారణం!

అప్పటి మద్రాసు గవర్నర్ సర్ ఆర్ధర్ ఎలిబంక్ హేవలాక్ పేరు వంతెనకు పెట్టారు. చీఫ్ ఇంజనీర్ ఫెడ్రిక్ ధామస్ గ్రాన్ విల్లే వాల్టన్ ఈ రైల్వే వంతెన నిర్మాణాన్ని పూర్తిచేయించారు. మూడేళ్ళు పట్టిన ఈ నిర్మాణం అంచనా వ్యయం 50 లక్షలరూపాయలుకాగా (మద్రాసీ?) కాంటా్రక్టర్ 47 లక్షలకే పనిపూర్తిచేశారట! నీటి ప్రవాహవేగాన్ని లెక్కగట్టి వందేళ్ళు వుంటుందన్న అంచనాతో అద్భుతమైన ఇంజనీరింగ్ ఫీట్ గా రాయి సున్నాలతో స్టీలు గర్డర్లతో కట్టిన హేవలాక్ వంతెనపై రాకపోకలను సరిగ్గా వందేళ్ళకు 1997 లో నిలుపుదల చేశారు. రైల్వేశాఖ వంతెనలో ఇనుమును వేలం వేయాలని నిర్ణయించింది. గర్డర్లు తొలగించాక రాతిస్ధంభాలు కాలక్రమంలో నదిలోకి ఒరిగిపోతాయి.

హేవలాక్ వంతెనను పరిరక్షించాలని, టూరిస్టుకేంద్రంగా వృద్ధిచేయాలనీ, జాతీయ స్మారకంగా వుంచాలనీ రాజకీయాలకతీతంగా ఉద్యమనిర్మాణానికి ప్రజలను కూడగట్టే ప్రయత్నాలు రాజమండ్రిలో మొదలయ్యాయి.

హేవలాక్ వంతెన సంస్కృతినీ దృక్పధాలనీ దేశమంతటికీ రవాణా చేసిన వారధిఅవ్వడంవల్లే వంతెన కూల్చివేత ఆలోచనే ఒక ఉద్వేగమౌతోంది.

ఏకథైనా ఆసక్తికరమే. సమాజం చరిత్రకంటే ఆసక్తిదాయకమైన కథవుండదు. శరవేగంగా మార్పులను అందుకుని అందుకు అనుగుణంగా తనను తాను మలచుకున్న తూర్పుకోస్తా ప్రయాణానికి గోదావరి అడ్డుపడినప్పుడు మౌనంగా వీపున మోసిన “హేవలాక్ వంతెనే” ఐదుతరాల కథకు అసలైన హీరో!

ఈజ్ఞాపకాల ఉద్వేగాన్ని భౌతికరూపంతో ఒక స్మృతి చిహ్నంగా మార్చుకోవడం చిన్న విషయం కాదు. అది విజయవంతమైతే చరిత్రను పదిలపరచుకునే దారికికూడా హేవలాక్ వంతెన మళ్ళీ వారధే అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *