డియర్ వేణు! జర్నలిస్టుగా నేను పోగొట్టుకున్నవాటిలో అతిముఖ్యమైనది చదువుకునే అలవాటు…

డియర్ వేణు,

మనిషినుంచి లోపలిమనిషిని దూరంచేసే ఉద్యోగాల్లో జర్నలిస్ట్ ఉద్యోగమొకటని తెలిసే సరికే చాలాఏళ్ళు (జర్నలిజం వృత్తికాదు ఉద్యోగమనీ, మితిమీరిన వత్తిడివల్ల – ఈ పని స్పందనలు కోల్పోయిన యంత్రప్రాయమేననీ తెలుసుకునే సరికి కొన్నేళ్ళ) గడచిపోయాయి.

నేను పోగొట్టుకున్న వాటిలో అతిముఖ్యమైనది చదువుకునే అలవాటు.

నాకు పుస్తకాలు కొని చదవడమే నచ్చుతుంది. ఎవరినుంచైనా తీసుకువస్తే తిరిగియిచ్చేయాలన్న ఆలోచన స్ధిమితంగా వుండనీయదు.

మనం విజయవాడలో పనిచేసినప్పుడు ప్రతీనెలా పుస్తకాల బడ్జెట్ వుండేది. కథలు నవలలు సాహిత్య వ్యాసాలు …. చివరి ప్రాధాన్యతగా కవితలు..ఒకటేమిటి పుస్తకం దొరికితే చదవాల్సిందే

ఒకే పెద్దయింట్లో అయిదు కుటుంబాలవాళ్ళం అద్దెకుండేవాళ్ళం. ఒక వేసవిలో అన్ని ఇళ్ళలోనూ ఇల్లాళ్ళు పిల్లల్నితీసుకుని పుట్టిళ్ళకు వెళ్ళారు. నాభార్య అన్ని యిళ్ళ కరెంటుబిల్లులు కట్టేపని నాకుపెట్టి అందరి డబ్బులూ యిచ్చి రాజమండ్రి వెళ్ళిపోయింది. బిల్లు కట్టేగడువు ఇంకావుంది.కొత్తపుస్తకాలు వచ్చాయి. జీతంతీసుకున్నాక కట్టొచ్చన్న ధీమాతో పుస్తకాలు కొనేసి వాటిని చదివే ఆబలో దాదాపు రాత్రంతా మెళకువగా వుండి ఉదయమే లేవలేక ఇతర రిపోర్టర్లనుంచి వార్తలు తీసుకుని…రోజులు గడిపేసి ఫ్యూజులు తీసేసేదాకా బిల్లు మరచిపోయిన సంఘటన నా వ్యక్తిగత క్రమశిక్షణా రాహిత్యానికీ…పుస్తకాలు చదవడం మీదున్న నా ప్రేమకీ , ఒక జ్ఞాపకమే!

మనసుకి నచ్చకపోవడం మొదలైందంటే ఇక ఆపనిమీద అసహనం రోజురోజుకీ రెట్టింపైపోతూనేవుంటుంది. కారణాలేమి చెప్పుకున్నా అలాంటి తట్టుకోలేని ఒక సందర్భంలో ఈనాడు నుంచి వచ్చేశాను.

భార్య, హైస్కూలుకొచ్చిన ఇద్దరు కొడుకులు, 630 రూపాయల బేంకు బ్యాలెన్సు, ఇంతకాలం ఈ మిడిల్ మేనేజిమెంటువాడి తో ఎలా పనిచేశానా అని గుండెనిండా ఆశ్యర్యం – ఓ మూల పెద్దహాయి, ఎలాగైనా బతకలేకపోమన్నధీమా, మనమెవరికీ ద్రోహం చేయలేదు కాబట్టి దేవుడు మనకి అన్యాయం చేయడని భార్య యిచ్చిన భరోసా తప్ప 18 ఏళ్ళు పనిచేసి 1997 జూన్ 6 న ఉద్యోగం మానేసేటప్పడికి నాదగ్గర ఏమీలేదు.

జర్నలిస్టుల కుటుంబాలకు సాయంకాలాలు వుండవు. నేను ఉద్యోగం వదిలేశాక ఇంచుమించు ఆరునెలలపాటు (గ్రాట్యుయిటీ డబ్బులు అయిపోయేదాకా) మాకూ సాయంత్రాలు మిగిలాయి. చిరంజీవి సౌభాగ్యవతి నా భార్య సుదీర్ఘకాలం మిగుల్చుకున్న సంతోషం ఆ సమయమే నేమో!

ప్రేమాస్పదంగా, గౌరవంగా, ఆర్ధికకోణంనుంచి జస్ట్ సంతృప్తికరంగా జీవించడానికి, ఈమూడూ పొసగనిపొత్తులని అర్ధంచేసుకుంటూ పొత్తుపొసగించడానికి దాదాపు నిరంతర పోరాటంలాంటి ఉద్యమం చేస్తూ నిలదొక్కుకోడానికి ఇంకో 15 సంవత్సరాలు పట్టింది. ఈదశలోనే ఆరోగ్యం బాగాదెబ్బతినేసింది.

నెలనెలా జీతంలేని పనిలో రోజువారీ పెనుగులాట,(చాలాసార్లు సమాధానం దొరకని) రేపేమిటన్న ప్రశ్నే పూర్తిగా ఆవరించేసుకుని నేను “ఖాళీ” లేనిమనిషినైపోయాను.

కొద్దిపాటి డబ్బు, కాస్త సహృదయత, అన్నిటికీ మించి ఓపెన్ మైండు వున్న పౌరప్రముఖుడి సావాసం నాకు పెద్దపనినే అప్పగించింది. ఈతిబాధలు తీరిపోయాయి.
కాస్తవెసులుబాటు దొరికాక మళ్ళీ చదువుకోవచ్చని సంబరపడిపోయాను.

వేలాది మంది పాఠకుల మాదిరిగానే నేనూ దారితప్పి టివి ప్రేక్షకుణ్ణయిపోయినవాణ్ణేనని అప్పుడే అర్ధమైంది…

అయినా మొండిగానే చేసిన ప్రయత్నానికి మళ్ళీ మూడు అవరోధాలు ఎదురయ్యాయి.

ఒకటి-సాహిత్య సారస్వత సాంస్కృతిక కేంద్రమనిపించుకుంటున్న రాజమండ్రిలో మంచి పుస్తకాల షాపు లేకపోవడం, రెండు – కాస్త శ్రమా ఖర్చు తో విజయవాడవెళ్ళి పుస్తకాలు తెచ్చుకున్న ప్రతీసారీ , (పుస్తకాలు ఎక్కడపడితే అక్కడ పరచేసే ఆసంబరం కొన్ని రోజుల పాటు వుంటుంది) పుస్తకాలతో సహా నిన్నూ కిందికి విసిరేస్తాననే మా ఆవిడ విసుగుదల (వయసైపోతోందికదా!) అదీగాక ఇల్లుకూడా చిన్నదే మరి

ఈ రెండు కారణాలకూ మించింది …నా ఉద్వేగాలకు సంబంధించినదీ మూడో కారణం.

గ్లోబలైజేషన్/ప్రయివేటైజేషన్ మూలాలనుంచి పుట్టింది నేను పనిచేస్తున్న ప్రాజెక్టు. ఇలాంటిచోట్ల కనీసహక్కులను గుర్తించనట్టే నటిస్తారని, మానవ సంబంధాలే వుండవని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.
నా అతిచిన్న అధికార పరిధిలో ఈ పరిస్థితులు లేకుండా చూడగలగడం కాస్త తృప్తి అనిపిస్తూంది.

ఆదే కొన్నిసార్లు చర్చకు దారితీసినపుడు వాదించకుండా మౌనంగా వుండి పోవడమే నేను నేర్చుకున్న సూత్రం. ఒకప్పుడు ఇలాంటి “నిస్సహాయత” నన్ను నీలదీసేది… ఉక్రోషపరచేది…ఉద్వేగపరచేది…నిలదీయించేది.

నిస్సహాయత “లౌక్యం” గా రూపాంతరం చెందాక ఎపుడూ నిర్వేదం …ఎపుడో ఓ ఉలికిపాటు తో రోజులు వెళ్ళిపోతున్నాయి. విచిత్రమేమిటంటే ఈ అవస్ధే నాకు కాస్త డబ్బు యిచ్చింది. ఈ సావకాశం కూడా పుస్తకాలు చదవనీయలేదు.

ఏది చదువుతున్నా ఒక అంతర్మధనం మొదలౌతోంది. తలవొంచుకున్న “లౌక్యం” ముందు “నిస్సహాయత” తలెగరేయడం మొదలుపెడుతోంది.

ఈ పరిణామాలన్నీ చదువునుంచి నన్ను చాలాదూరం ఈడ్చుకుపోయాయి.

ఆరోగ్యకారణాలతో పాటు కాస్త ఆదాయం కూడా స్ధిరపడ్డాక రెండేళ్ళనుంచీ పెద్దపనులు పెట్టుకోకుండా దాదాపు పెన్షనర్ లాగే జీవిస్తున్నాను.

దారితప్పి ప్రేక్షకుణ్ణయిపోయిన నాకు మళ్ళీ చదువుకోవాలనిపించింది. మొదటినుంచీ పడుకునే చదవడం నా (చెడ్డ) అలవాటు. పడుకుని పట్టుకోడానికి వీలుగా మన పుస్తకాలు వుండవు.

ఇ-రీడింగ్ దీనికి ఒక పరిష్కారమని నాకు అర్ధమయ్యేసరికి తెలుగు ఇ పుస్తకాలు లేవు. రాకపోతాయా అన్న నా ఆశ kinige.com వల్ల నెరవేరింది. మొదట iPad మీద blue fire రీడర్ లో తెలుగు ఇ పుస్తకాలు చదివేవాడిని. వెల్లకిలా పడుకుని వుండగా దాదాపు అరకిలో బరువున్న ఐపాడ్ ని పట్టుకుని చదవడం సౌకర్యం కాదు. అదీగాక మొబైల్ ఫోన్, ఐపాడ్ వగైరా గాడ్జెట్టుల సీ్ర్కన్ వెనుక నుంచి వచ్చే కాంతికి చదివేకళ్ళు త్వరగా అలసిపోతాయి.

ఇంక్ టెక్నాలజీతో (అంటే కాంతి అక్షరాలమీద పడగా ఆ అక్షరాలను మనం చదువుకోవడం / లైటు వేసుకుని లేదా పగటి పూట పుస్తకం చదువుకోవడం) తయారైన ఈ రీడర్లే సమస్యకు పరిష్కారమని అర్ధమయింది.

తెలుగులో ఇ పుస్తకాలు వేసే ఏకైక సంస్ధ కినిగే ప్రచురణలు అన్ని ఈ రీడర్లలోనూ తెరచుకోవు. వారి సూచన మేరకు “సోని రీడర్” ఈబే లోకొన్నాను. చాలా పుస్తకాలు కొని ఈ ఉపకరణంలో డౌన్ లోడ్ చేసుకున్నాను. చిన్నగా చదువుకుంటున్నను.

ఇకదొరకవేమో అన్నంత ఆబగా ఆన్ లైన్ లో పుస్తకాలు దిగుమతి చేసుకున్నప్పుడల్లా నాకు చాలా ధీమాగా వుంటుంది. చిన్నపాటిగర్వంగా కూడా అనిపిస్తుంది.

నేనువుంటున్న ఇంటిని కొనుక్కున్నప్పటి తృప్తికంటే పుస్తకాలు సమీకరించుకునేటప్పటి సంతృప్తే నాకు ఎక్కువ ఆనిపిస్తుంది.

మళ్ళీ చిన్న సమస్య నా పగటి సమయం దాదాపు షెడ్యూలైపోయివుంటుంది. ప్రశాంతంగా చదువుకునేది రాత్రివేళే. అప్పుడు లైటువేసి చదువుకోవడం నా భార్యా పిల్లల ప్రశాంత నిద్రను ఇబ్బంది పెట్టడమే. అందువల్ల నేను అనుకున్నంత వడిగా చదువు సాగటంలేదు.

కంటికి శ్రమకలిగించని ఇంక్ టెక్నాలజీకి ఇన్ బిల్ట్ లైటుని అమర్చిన ఇ రీడర్లు ఈమధ్యేమార్కెట్ లోకి వచ్చాయి. వాటిలో కినిగేకి కంపేటబిలిటీ వున్న “kobo glo” అనే రీడర్ ని ఇప్పటికే యు ఎస్ లో వున్న ఒక స్నేహితుడు నాకోసం కొన్నాడు. (ఇది ఇ బే లో లేదు- ముంబాయి, ఢిల్లీలలో కూడా ఈ రీడర్లు లేకపోవడం కాస్త ఆశ్చర్యంగావుంది-త్వరలో మన మార్కెట్ కి కూడా విద్యార్ధుల కోసం ఇవి బాగావచ్చే సూచనలూ వున్నాయి)

అతని భార్య 31 న ఇండియా వచ్చేటప్పుడు నారీడర్ కూడా తెస్తారు. ఆమె కుటుంబీకులంత ఆదుర్దాగానే నేను ఆమెకోసం ఎదురు చూస్తున్నాను

ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడెక్కడికో వచ్చేశాను. టెక్నాలజీలూ, గాడ్జెట్టులూ మన అవసరాల్ని సౌకర్యవంతంగా తీర్చవచ్చేమోగాని మననుంచి చాలాదూరం వెళ్ళిపోయిన మనల్ని మళ్ళీ మనలోకి తసుకు రాలేవు కదా!

వుంటాను
25/07/2013

*ఇంకోమాట చిన్న ఉత్తరం రాసే తీరికలేక ఇంతపెద్ద ఉత్తరం రాశాను

నా హైస్కూల్ రోజుల్లో పోస్ట్ మన్ ఇచ్చిన వుత్తరం చదివాక దాచివుంచడానికి కొక్కెంవున్న ఊచలాంటి ఉత్తరాల బొత్తి వుండేది. దానికి ఉత్తరాన్ని గుచ్చకానికి మా తమ్ముడూ నేనూ పోటీ పడేవాళ్ళం. అప్పట్లో ఉత్తరం …అందుకున్న వాళ్ళదగ్గరే వుండేది. మెయిల్ పుణ్యమా అని ఒకే ఉత్తరం అందుకున్న వారిఇన్ బాక్స్ లో పంపిన వారి సెంట్ బాక్స్ లో కూడా వుండటం విచిత్రమనిపిస్తోంది.

కొయ్యగుర్రమెక్కి (వర్చువల్) లోకంలో స్వారీచేసినట్టు – ఈ ఉత్తరం మీ చేతికందకపోవడం ఎంత నిజమో దీన్ని మీరు చదువుతూండటం కూడా అక్షరాలా అంతే నిజం
అసలు ఈ టెక్నాలజీ ఇంద్రజాలం మనుషుల్ని ఎంత మోహపరుస్తూందోకదా!

పాఠకులు ప్రేక్షకులయ్యారు
ప్రేక్షకులు సగంనిజాలు సగం డిజిటల్స్ అయిపోతున్నారు.
వర్చువల్ జీవితాలనుంచి అందరమూ ఎప్పటికైనా వెనక్కి వచ్చేస్తామా?
మామూలు మనుషులమౌ తామా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *