‘సఫాయి’, ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమాల మధ్య పోలికలు తేడాలను పోల్చే ప్రయత్నంలో వున్నాను. 45 ఏళ్ళ పైమాటే…అప్పుడు నేను నాలుగు ఐదు క్లాసుల్లో వున్నాను. ప్రతి ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ గ్రామాల్లో మా నాన్న, అమ్మ వీధులు తుడవడం, చెత్త ఎత్తి పొడి చెత్తను తగలబెట్టడం, తడి చెత్తను కుప్పలో కలపడం, పారిశుధ్యం అవసరం మీద కరపత్రాలు పంచడం, గ్రామ చావిళ్ళలో సభ పెట్టి ఉపన్యాసం ఇవ్వడం చేసేవారు. మమ్మల్ని చూడ్డానికి ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్లేమో నేను నా తమ్ముడు …అమ్మ నాన్నలతో పాటే సఫాయి పని దగ్గరే వుండేవాళ్ళం. కాస్త కాస్త చెత్త మోసిన అనుభవం కూడా నాకూ, తమ్ముడికీ వుంది.
మా అమ్మ నాన్న గాంధీ నిర్మాణ కార్యక్రమాలపై సబర్మతి ఆశ్రమంలో నెలరోజులు శిక్షణ పొంది వచ్చారు. ఆకార్యక్రమాల్లో సఫాయి ఒకటి. పారిశుధ్యం పై ప్రజల్లో చైతన్యం తెచ్చే సఫాయి లో హరిజన వాడలకు ప్రాధాన్యత వుండాలన్నది కార్యక్రమం.
తాడువాయి, దర్భగూడెం, చిన్నావారిగూడెం, చల్లావారిగూడెం, లలో సఫాయి పూర్తయింది. జొన్నావారిగూడెంలో పనిచేస్తూండగా అమ్మకి జబ్బుచేసింది. అంతటితో దాదాపు రెండు సంవత్సరాల సఫాయి నుంచి మా కుటుంబం వైదొలిగింది. తరువాత కొద్దివారాలకు స్థానికులు ఆ కార్యక్రమాన్ని పక్కన పెట్టేశారు. అప్పట్లో కార్యక్రమానికి ముందు రోజు టముకు వేయించేవారు. అలా డప్పుకొట్టి చెప్పిన వెట్టికి ఒక అణా టిప్పు పెద్దల్లో ఎవరో ఒకరు ఇచ్చేవారు. అదే పెద్ద / ఏకైక ప్రచారం
(అస్పృశ్యత నివారణ కూడా మరొక గాంధీ సూత్రమే. హరిజనవాడల్లో సఫాయి పనిచేసి వచ్చినందువల్ల మోతుబరుల ఇళ్ళల్లో మాకు పశువుల పాకలోనో అరుగు మీదో భోజనం పెట్టేవారు అది మరో సందర్భంలో చెబుతాను)
ఇపుడు సమాచార ప్రసార సాధనాలు బీభత్సంగా (అవును బీభత్సంగానే) అందుబాటులో వున్నాయి. ఈ సమయంలో స్వచ్ఛ భారత్ కు మోదీ గారు ఇచ్చిన పిలుపునకు టివిల్లో సోషల్ మీడియాలో స్పందన బాగా కనబడుతోంది.
ఒక కార్యక్రమానికి ప్రజలను సమాయత్తం చేయడం చిన్నవిషయం కాదు. ఆపనిని మనుషులకు పులిమితే చాలదు..ఆత్మలో నింపాలి. అందుకు పెద్ద హోంవర్క్ జరగాలి. అదేమీ లేకుండా టివిల్లో చూపించే బొమ్మలు స్పూర్తిని నింపలేవేమో నని నా అనుమానం
టివిల్లో పేపర్లలో స్వచ్ఛభారత్ కార్యక్రమాలు సరే! ఈ కార్యక్రమంలో పాల్గొనదలచినవారు అందుకు రోజులో ఎంత సమయం కేటాయించగలరో అలా ఎంత కాలం ఏమేమి పనులు చేయదలచుకున్నారో స్పష్టతరావాలి. అలాకాకుండా పనిలోకి దూకెయ్యడమంటే పళ్ళుతోముకోకుండా భోజనంతినేయడమేనని నా భావన
స్వచ్ఛభారత్ లో పాల్గొనే వారు ముందుగా చిత్తాన్ని లక్ష్యాన్ని స్వచ్ఛంగా వుంచుకోవడం అతిముఖ్యం. ఇది వుంటే ప్రచారం అంతగా లేకపోయినా కార్యక్రమం సఫలమౌతుంది.
ఇందుకు గాంధీ గారికంటే పెద్ద ఉదాహరణ వుండదు. ఆయన ఆఫ్రికాలో వుండగా పారిశుధ్యం అవసరాన్ని ఎందుకు గుర్తించారో ఒక పేజీ ఈ అప్ డేట్ కి అటాచ్ చేశాను ఈ పేజీలు గాంధీ గారి ఆత్మకథ My Experments with Truth కి తెలుగు అనువాదమైన “సత్యశోధన లేక ఆత్మకథ” పుస్తకంలో వున్నాయి.
(ఈ పుస్తకాన్ని kinige com లో కొనుక్కోవచ్చు)