ఉత్తరాఖండ్ తెలుగు బాధితుల దౌర్భాగ్యం ?

ఆపదొచ్చినపుడు ఆదుకోలేని కిరణ్ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఏంచేయాలి??

క్రైసిస్ మేనేజిమెంటులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగావుపయోగపడుతుంది. మోడికి, బాబుకి వున్న ఈ అవగాహన కిరణ్ కు లేకపోవడం ఉత్తరాఖండ్ తెలుగు బాధితుల దౌర్భాగ్యం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఢిల్లీలో ఒక స్ధావరం వుంది. చిన్నదో పెద్దదో ఒక యంత్రాంగముంది. ప్రభుత్వానికి శాటిలైట్ ఫోన్లున్నాయి. ఆఘమేఘాలమీద ఎక్కడికైనా వెళ్ళడానికి విమానాలున్నాయి. డబ్బు ఇబ్బందులున్నా ఆపదల్లో అక్కరకు రానంత దిక్కుమాలిన దరిద్రం మాత్రం లేదు.

ఉన్నదల్లా ఆలోచనల దరిద్రమే…ఉన్నదల్లా నిలువెత్తు ఉదాసీనమే…ఉన్నదల్లా మనవల్లకాదన్న అలక్ష్యమే!

ఉత్తరాఖండ్ వెళ్ళాలన్న మాటటుంచి అక్కడివిపత్తులో బతికిబయటపడి ఢిల్లీ లో ఆంధ్రాభవన్ చేరుకున్న తెలుగు బాధితులకు అధికారులు వసతులు ఏర్పాటుచేయలేకపోయారు భోజనానికి కూడా (మొదట్లో)డబ్బులు వసూలు చేశారు. హైదరాబాద్ నుంచి స్పష్టమైన సూచనలు ఆదేశాలు ఎపి భవన్ కి ముందుగా వెళ్ళకపోవడమే ఈ దౌర్భాగ్యానికిమూలం.

కమ్యూనికేషన్ వ్యవస్ధ అద్భుతంగా వికసించిన కాలంలో కూడా ఇలాంటి నిస్సహాయ పరిస్ధితులు పదేపదే తప్పడంలేదంటే సదుపాయాల్ని – అవసరాలకు తగినట్టుగా సమన్వయం చేసుకోలేని వెనుకబాటుతనమో చేతగానితనమో నాయకుల్లో అధికారుల్లో పేరుకుపోవడమే మూలం. ఆలోచన అంటూవుంటే అమలుచేసే మార్గాలూ అవే క్యూలో నిలబడుతాయి.

ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందరు(సుమారుగా)యాత్రికులు చార్ ధామ్ యాత్రకు వెళ్ళారో ప్రభుత్వానికి స్పష్టతలేదు. ఇలాంటి సుదూర / అరుదైన యాత్రలకు వెళ్ళే వారిలో 90 శాతం మంది టూరిస్ట్ ప్యాకేజీలద్వారా , 10 శాతం మంది గ్రూపులుగానో బయలుదేరుతారు. టూరిస్టు సంస్ధలనుంచి ఆవివరాలు సేకరించడం పెద్ద విషయం కాదు. జిల్లాకొక టోల్ ఫ్రీ నంబరు పెట్టి యాత్రకు వెళ్ళిన కుటుంబాల వారినుంచి యాత్రీకుల వివరాలు సేకరించడం కష్టం కాదు. ఈ ఏర్పాట్లు జరగాలేకాని గంటలవ్యవధిలోనే మొత్తం సమాచారం తెలియజెప్పే మొబైల్ ఫోన్లు, సమాచారాన్ని విశ్లేషించే కమ్యూనికేషన్లు మనకున్నాయి. ఎటొచ్చీ ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చన్న బుద్ధీ జ్ఞానాలే ముఖ్యమంత్రి మొదలు ఆయనకు సలహాలు ఇచ్చే సీనియర్ అధికారుల వరకూ ఎవరికీలేవని అర్ధమౌతోది

ఇన్ ఫర్ మేషన్ టెక్నాలజీతోనే సమస్యలు పరిష్కారం కావు. సమస్య తీవ్రతను తెలుసుకోడానికి ఈ టెక్నాలజీ అద్భుతంగా వుపయోగపడుతుంది. దాన్ని వినియోగించుకుని ఎలా పనిచేయాలన్న దృష్టి నాయకులకూ అధికారులకూ వుండాలి.

ఒడిషా తుఫాను విపత్తులో ఆదుకోడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మన అధికారులను పంపారు. పనిలో మన బృందాల అవగాహనను, ఐటి తోట్పాటుని ఒడిషా ముఖ్యమంత్రే ప్రస్తుతించారు

ఇపుడు గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ స్వయంగా ఉత్తరాఖండ్ వెళ్ళారు రెండు విమానాల్లో ఆరాష్ట్రం బాధితులను వెంటతీసుకువెళ్ళారు. రెండు విమానాలతో సమస్యమొత్తంతీరిపోదు.ముఖ్యమంత్రే స్వయంగా బాధ్యత తీసుకోవడం అధికారుల నిమగ్నతను పెంచుతుంది.

గుజరాత్ అధికారులకు వారిరాష్టా్రనికి చెందిన బాధితుల మీద ఒక అవగాహన వుండటానికి ప్రధాన కారణం నాయకత్వమే అయితే రెండోకారణం ఐటి కల్పించిన అవగాహనే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ స్వయంగా వెళ్ళలేకపోయినా బాధితులకు ఢిల్లీ ఎపి భవన్ లో ఉచిత భోజన వసతులు కల్పించడంతో బాటు విమానాలుకాకపోయినా ప్రత్యేక రైలుబోగీలైనా ఏర్పాటుచేయించలేక పోవడం దారుణం. కనీసం రైలుటికెట్టు ఏర్పాటుచేయగలిగినా బాధితులకు పెద్ద ఉపకారమే అవుతుంది.

కష్టకాలంలో ప్రభుత్వం ఏంచేయాలో చంద్రబాబుకి అవగాహనవుంది. (కమ్యూనికేషన్ వ్యవస్ధ ఇపుడున్నంత గాలేని)1996 తుపాను సమయంలో ఆయన ప్లానింగ్, ఫాలో అప్ ల విశ్వరూపాన్ని ఉభయగోదావరి జిల్లాల్లో జర్నలిస్టులు అతిసమీపంనుంచి చూశారు. ఇంప్లిమెంటులో అక్కడక్కడా లోపాలు వుంటే వేరేసంగతి.

ఢిల్లీ ఎపిభవన్ లో చంద్రబాబు ధర్నాచేయడం అక్కడి ఏర్పాట్లు పరిస్ధితులపై తీవ్రమైన నిరసనగానే అర్ధమౌతోంది. రాజకీయాధికారమే ఆయన లక్ష్యం కావచ్చు..అంతమాత్రాన ప్రభుత్వ వైఫల్యంమీద అసహనాన్ని వ్యక్తం చేస్తే అదికూడా రాజకీయమంటే ఎలా? (మాట వరసకి ఇదీ రాజకీయమే అనుకుందాం! రాజకీయవేత్తలు రాజకీయాలు మానేసి కబాడీ క్రికెట్టు ఆడరు కదా! గుజరాత్ ప్రభుత్వం లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అకేషన్ కి రైజ్ అయివుంటే తిట్లు, శాపనార్ధాలూ, ధర్నాలు వుండవు కదా!)

అద్భుతమైన కమ్యూనికషన్లున్న 2013 లో అసలు క్రైసిస్ మేనేజిమెంటు ప్లానే లేని కిరణ్ కుమార్ ప్రభుత్వం నెత్తిమీదుండటం ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యమే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *