ఎపికి మెట్రో రైలు కుదరదు 

ప్రపంచమే మార్కెట్ అయిపోయాక లాభాలే తప్ప ప్రజాప్రయోజనాలు వుండవు. ప్రభుత్వాలే కాళ్ళావేళా పడినా ‘డబ్బు’ నష్టానికి ఒప్పుకోదు. విజయవాడ మెట్రోరైలు పట్టాలు ఎక్కదు. తలతాకట్టు పెట్టుకుంటేతప్ప రైతుపొలాన్ని సింగపూర్ వాడిక ఇచ్చేస్తేతప్ప నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కి హోదాగానో, పాకేజిగానో ఉదారంగా మోదీ ఇవ్వడానికి ‘డబ్బు’ ఒప్పుకోదు.

విజయవాడలో మెట్రోరైలు సాధ్యంకాదని కేంద్రప్రభుత్వం తేల్చి చెప్పేసింది. కేంద్రం ప్రస్తావించిన సూచికల ప్రకారం విశాఖపట్టణంతో సహా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా మైట్రోరైలు వచ్చే అవకాశాలు లేవు. విజయవాడలో మెట్రోరైలు ఏర్పాటు చేయడానికి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సర్వే చేసి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్) రూపొందించింది. ఇందుకు రాష్ట్రప్రభుత్వం 25 కోట్లరూపాయలు చెల్లించింది. డిపిఆర్ ని రాష్ట్రం కేంద్రప్రభుత్వానికి పంపింది. కేంద్రం కొద్దిరోజుల క్రితం ఈ ప్రాజెక్టు అమలు సాధ్యంకాదని రాష్ట్రానికి సమాధానం పంపింది. ఇందుకు రెండు కారణాలను పేర్కొన్నారు. మేట్రో రైలుకి నిర్మించాలంటే ఆప్రాంతపు జనాభా కనీసం 18 లక్షలు వుండాలి. అయితే విజయవాడ జనాభా 2020 నాటికి కూడా 10 లక్షలకు మించడంలేదని కేంద్రం అభ్యంతరాన్ని వెలిబుచ్చింది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో 20 శాతం నిధుల్ని కేంద్రం గ్రాంటుగా ఇస్తుంది. మిగిలిన 80 శాతం నిధుల్ని రాష్ట్రప్రభుత్వం సమకూర్చుకోవాలి. అయితే ఈ నిధులు ఎలాసమకూరుస్తారో రాష్ట్రప్రభుత్వం వివరించలేదని కేంద్రం పేర్కొంది. అయితే ఇది తిరస్కారం కాదని వివరణలు కోరడం మాత్రమేనని ఒక ఉన్నతాధికారి చెప్పారు. తగిన సమాధానాలతో ప్రాజెక్టు నివేదికను మళ్ళీ కేంద్రానికి పంపి ఆమోదం తెచ్చుకోవచ్చు. కేంద్రం గ్రాంటు పెంచేలా చేసుకోవచ్చు. జనాభా నియమాన్ని సడలింపచేసుకోవచ్చు అని ఒక ఉన్నతాధికారి చెప్పారు. ఇదంతా జరగాలంటే శక్తివంతమైన రాజకీయ లాబీయింగ్ అవసరం. అదికూడా సాధించుకున్నాం అనుకున్నా ఎకనమిక్ వైబిలిటీ లేకపోతే మెట్రోరైల్ ఆపరేటర్ ముందుకి వస్తారా అన్నదే అసలు ప్రశ్న. ఆర్ధిక పరమైన గిట్టుబాటుకి వినియోగదారుల సంఖ్య అంటే జనాభా ఒక కొలమానం. దీన్ని బట్టి విజయవాడకు ఇప్పట్లో మెట్రోరైలు రాదని అర్ధం చేసుకోవచ్చు. ఇదే వాస్తవికత విశాఖపట్టణానికి కూడా వర్తిస్తుంది. తెలిసో తెలియకో రాజకీయనాయకులు చూపించే రంగుల సినిమాలను వాస్తవికతలు అట్టర్ ఫ్లాప్ చేస్తాయనడానికి విజయవాడ మెట్రోరైలు ఒక ఉదాహరణ మాత్రమే!

2 thoughts on “ఎపికి మెట్రో రైలు కుదరదు ”

  1. విజయవాడకి మెట్రో రైలు అవసరం లేకపోతే, మరి అంతకన్నా చిన్నదైన కొచ్చి కి మెట్రో రైలు ఎందుకు ఇచ్చారు?

  2. నా బ్లాగులో టపాలని ఇష్టపడినందుకు కృతజ్ఞతలు.
    మీ అభిప్రాయాలు కూడ వ్రాస్తే మరింత సంతోషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *