ఇల్లుకూలి,కోడీ మేకా గేదే పోయి, పడవ చితికి, వలచిరిగి, కౌలుభూమి కుళ్ళినపుడు కేవలం రెక్కల కష్టం మీదే బతికే మనిషే తొందరగా తేరుకున్నాడు. తుపాను షెల్టర్లలో సర్కారు ఆహారంకొసం పడిగాపులు పడకుండా ఇంకో పనిచేస్తే జీవితమిచ్చే పట్టణానికి బతుకుదారి పట్టాడు. 1990, 1996 తుపానులను, అనంతర తాత్కాలిక ,శాశ్వత పునరావాసాలను గమనించాక ఇది నాకు అర్ధమైంది. మరి ఇపుడు ఆపరిస్ధితులు వున్నాయా? ఆంధ్రప్రదశ్ లోనే అతి పెద్దనగరం నుంచి నా ఆలోచనలు బయటికి రావడంలేదు.
మహావిపత్తునుంచి విశాఖపట్టణం తన బిడ్డల ప్రాణాలనైతే కాపాడుకుంది కానీ, తీవ్రంగా గాయపడింది. ఆర్ధికంగా చితికిపోయింది. ధ్వంసమైన విమానాశ్రయాన్నీ, కెమెరాకి సుళువుగా దొరికే విధ్వంసాన్ని టివిలు బాగానే చూపిస్తున్నాయి. కమర్షియల్ భవనాలు పబ్లిక్ ఆఫీసులు, రోడ్లు, విద్యుత్, నీటిసరఫరా, కమ్యూనికేషన్లు, పబ్లిక్, వంటి ఇన్ ఫ్రాస్ట్రక్చర్లు తొందరగానే నిర్మాణమౌతాయి. ఆర్ధికంగా భారమే అయినా నిధులూ వనరులూ సమకూరుతాయి.
సమస్యంతా పౌరుల వ్యక్తిగత సొత్తుల విషయంలోనే. కొన్ని సంవత్సరాల కష్టంతో కట్టుకున్న ఇళ్ళు దెబ్బతింటే వాటితోపాటేపెంచుకున్న చెట్టు విరిగిపోతే ఆ దిగులు ఎప్పటికి తీరుతుంది? తక్షణ మరామ్మతులు చేసుకోడానికి డబ్బెలాగ ప్రభుత్వ సాయం వచ్చేవరకూ పైకప్పో పక్కగోడో కూలిపోయిన ఇంట్లో ఎండుతూ నానుతూ వుండవలసిందేనా? చేతిలో అవసరమైనంత డబ్బున్న వారైనాకూడా వెంటనే ఈ అవసరాలు తీర్చుకోగలరా? అందుకు వారికి మనుషులు యంత్రపరికరాలు అందుబాటయ్యే పరిస్ధితి కాదుకదా? ఎన్నివేల కెమేరాలైనా ఈ వ్యధను చూపించలేవు.
1990, 1996 తుపానుల అనంతరం కృష్ణా తూర్పుగోదావరి జిల్లాల నుంచి నుంచి పెద్దసంఖ్యలో గ్రామీణ పేదలు హైదరాబాద్ వలసలు వెళ్ళిపోయారు. ఇపుడు నగరమే దెబ్బతింది. దెబ్బతిన్న నగరంనుంచి కొత్తజీవితం కోసం వెళ్ళిపోడానికి హైదరాబాద్ మనదికాదు. విశాఖకు మించి పనులు ఇచ్చే అవకాశమున్న నగరం మనకు ఇంకోటిలేదు.
తక్షణ సహాయచర్యలు సరే! మరోచోటుకి వలసపోయే అవకాశంలేని పేదలు, మధ్యతరగతివారికి గట్టి భరోసా ఇచ్చే సూత్రంతోనే పునరావాసం ఏర్పాట్లు జరగాలి
అధునాతన టెక్నాలజీలన్నటినీ ఉపయోగించి ప్రాణనష్టాన్నితప్పించారు. తక్షణ సహాయాలకు కూడా ఈటెక్నాలజీలన్నీ ఉపయోగపడుతున్నాయి. మరి శాశ్వత పునరావాసాలకు సరికొత్తటెక్నాలజీలను ఎలాగూ వాడుకుంటారు. మరి అందులో మానవీయ దృక్పధం ఏమేరకు వుంటుందన్నదే పెద్ద అనుమానం.
రెండుతరాల క్రితం 28 ఏళ్ళనాటి తుపానులో నా జ్ఞాపకాలు అనుభవాలను ఈ మధ్యే నా బ్లాగులో రాశాను
మళ్ళీ ఇక్కడ పేస్టు చేస్తున్నాను ఆసక్తి లేకపోతే వదిలెయ్యండి
——————————————————————-
తీరాన్ని కూల్చిన కెరటం (1996 చీకటి జ్ఞాపకం)
అనుభవాలు | జ్ఞాపకాలు
కాపాడుకోలేనితనం నుంచి వచ్చే అసహాయత ఎంత భయంగా వుంటుందో, నాయకుడి ఆర్తి-ఆసహాయులకు ఎంత ధైర్యంగా వుంటుందో 1996 తుపానులో చూశాను. అనుభూతి చెందాను. ఆజ్ఞాపకాలు మూటగట్టి వుంచినట్టు ఇంకా భారంగా మెదులుతూనే వున్నాయి.
1000 మంది చనిపోయి మరో 1000 మంది గల్లంతైన ఆబీభత్సం లో తీరమంతటా ఉబ్బిపోయి పడున్న మనుషుల శవాలు, వాటిని రాబందులు కుక్కలు పీక్కునితినడం ఇంకా కనిపిస్తున్నట్టే వుంది.
నాకుటుంబం మరో మిత్రుడి కుటుంబం పదకొండు రోజుల దక్షిణ కర్నాటక టూర్ ముగించుకుని తిరుపతినుంచి బస్సులో బయలుదేరి జడివానల వల్ల 12 గంటలు ఆలస్యంగా 1996 నవంబరు 6 రాత్రి ఏడు గంటలకు రాజమండ్రిలో ఇల్లు చేరుకున్నాము. మనుషులు తడిసి మూటలుగా మారిపోయినా ‘చచ్చినట్టు’ వొండుకోవలసిన (కర్రీపాయింట్లు లేని)కాలమది. అలా కాస్తతినేసి ఒళ్ళ తెలియకుండా నిద్రపోయాము. తెల్లారి చూసేసరికి ఇంటి ఎదురుగా చెట్టు కూలిపోయివుంది. కరెంటు వైర్లు తెగిపోయాయి. స్తంభాలు వంగిపోయాయి. జనం రోడ్లమీదే వున్నారు. వీధిలోకి వచ్చి చూస్తే చెట్లన్నీ విరిగి పడి వున్నాయి. సముద్రతీరానికి 85 కిలోమీటర్లదూరంలో వున్న దానవాయిపేటంతా….రాజమండ్రంతా ఇదే సన్నివేశం. 1990 మే 9 నాటి తుపాను బీభత్సాన్ని కృష్ణాజిల్లాలో కవర్ చేసిన జర్నలిస్టుని అయివుండటం మూలాన ఎంతనష్టమో అని దిగులేసింది.
తూర్పుగోదావరి జిల్లావాసులకి రెండు రోజులవరకూ ఇది అద్భుతం 40/50 ఏళ్ళవయసున్న చెట్లు కూలిపోవడమంటే గాలితీవ్రత ఎంతుంటుందన్నదే అప్పటి ప్రశ్న. తీరగ్రామాల కష్టాలు నష్టాలూ ఒకొక్కటీ బయటపడుతూంటే జనం గుండెలు చెరువైపోయిన అనుభవాలు వందలు వేలే…
అపుడు నేను ఈనాడు రాజమండ్రి ఎడిషన్ చీఫ్ రిపోర్టర్ని. ఉభయగోదావరిజిల్లాలో దాదాపు 120 మంది విలేకరుల బృందాన్ని సమన్వయం చేయడం ప్రత్యేక వార్తాకధనాలకు అసైన్ మెంట్లు ఇవ్వడం నా బాధ్యతల్లో ముఖ్యమైనది.
కరెంటుపోయింది. ఫోన్లు పనిచేయవు. బయటిప్రపంచంతో సంబంధాలు లేవు. ఒకొక్క వివరమూ తెలిసే కొద్దీ భయంతో ఆశ్చర్యంతో నోటమాట వచ్చేదికాదు. సముద్రతీర ప్రాంతం నుంచీ 80 కిలోమీటర్ల వరకూ తుపాను ప్రభావం కనిపించింది. రోడ్లన్నీ కూకటి వేళ్ళతో పెకలించబడిన మహావృక్షాలతో నిండిపోయాయి. వాటిని ముక్కలు చేసి పక్కకి ఈడ్చి రోడ్లను క్లియర్ చేయడానికి 4/5 రోజులు పట్టింది. ఎక్కడికక్కడ ప్రజలే ఈ పని చేసుకున్నారు. రవాణాకు దారులు ఏర్పడ్డాకే అధికారుల వాహనాలు లోపలికి వెళ్ళి నష్టాలలెక్కలు రాసుకోవడం బియ్యం కిరోసిన్ మొదలైనవి పంపిణి చేశారు.
కాటే్రనికోన మండలం లో భారీ నష్టం జరిగింది సముద్రానికీ ఉప్పుటేర్లకూ మధ్య దీవిలా వుండే మగసానితిప్ప, నడుస్తూంటే సరుగుడుతోటలు మధ్య ఇసుకలో కాళ్ళూ కూరుకుపోతున్నట్టుండే బ్రహ్మదేవుడి గుడివున్న బ్రహ్మసమేధ్యం (నోరుతిరగక ఈ ఊరిని బ్రహ్మ సముద్రం అంటారు) బలుసువానితిప్ప, లక్షీ్మపాలెం ….ఇంకా చాలా ఊళ్ళు పేర్లు గుర్తుచేసుకోడానికి రాత్రినుంచీ పెనుగులాడుతున్నాను వల్లకావడంలేదు
ఆనాలుగైదు రోజులూ తీరగ్రామాల పరిస్దితి నరకం పశువులు మనుషుల శవాలు భరించలేని వాసనతో తేలుతుండగా బతికున్న మనుషులు ఆపక్కనే మెరక నేల మీద బిక్కుబిక్కుమంటూ గంటల్ని యుగాలుగా గడిపారు. హెలికాప్టర్లు జారవిడిచిన పేకెట్లు శవాల గుట్టల్లో, మలమూత్రాల మధ్య పడిపోయినపుడు కడుపుకాలి నకనకలాడిపోయారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడితో హెలికాప్టర్ లో నేను, ఫొటోగ్రాఫర్ 5 రోజులు ఈ ప్రాంతాలకు వెళ్ళాము. కాటే్రనికోన మండలంలో ఒక గ్రామం వద్ద ఈ పరిస్ధితి చూసి నాకు దుఃఖం ఆగలేదు. చంద్రబాబు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. కనకం అనే ఆవిడ నా తలమీద చెయ్యివేసి చంద్రబాబు చేయి పట్టుకుని ఓదార్చింది. గంగతల్లికి కోపమొచ్చంది మనమేమి చేస్తం అని ధైర్యం చెప్పింది
బ్రహ్మ సముద్రం దగ్గర తీరం వెంబడి 4 కిలోమీటర్లపొడవునా ఆరవై ఎనిమిది శవాలని నేనూ మరో విలేకరీ చూశాము. మేమే ఫొటోలు తీశాము.
కోరంగిదగ్గర మడ (బురద లో చిన్నచిన్న మానులతో మెత్తటి కలప గల చెట్లు, పొదలు వుండే సముద్రపు) అడవులలోకి బోటు ఏర్పాటు చేసుకుని వెళ్ళాము. పోగులు పడి కుళ్ళిపోతున్న మనుషులు పశువుల శవాలు
వాసనా వాతావరణాల్ని భరించలేక బయటపడుదామంటే అది వేగంగా పరిగెట్టలేని నాటు పడవ. దీనికి తోడు దారితప్పి గంటన్నర పాటు అక్కడక్కడే తిరుగుతూ వుండిపోయాము.
విషయాల సేకరణ, ఒకఎత్తయితే వార్తలన్నీ చీకటి పడముందే ఈనాడుకి చెర్చడం పెద్ద ప్రయాన అయ్యేది. ఇందుకు ఆయాకేంద్రాలనుంచి విలేకరులు పడిన శ్రమ అంతా యింతా కాదు సైకిళ్ళమీదా నడిచీ కూడా ప్రయాణాలు చేసిన సందర్భాలు వున్నాయి. నేను ఒక రోజు 13 కిమీ మరో రోజు 17 కిమీ నడిచాను రోడ్డుకి అడ్డంగా పడివున్న చెట్లను ఎక్కి, దిగి దాటుకుంటూ…
తూర్పుగోదావరి జిల్లాలో
అప్పటి గాలి వేగం 150 నుంచి 300 కీమీ , వర్షం 30 సెంమీ , మృతులు 978 , గల్లంతయిన వారు 1300 మందికి పైగా …., తీరంలో మండలాలు 13 గ్రామాలు గ్రామాలు 78
ప్రభావం తీరం నుంచి 100 కిమీ …నష్టాలు తీరంలో సర్వనాశనం
తీరం నుంచి దూరమయ్యేకొద్దీ చెట్లు కరెంటు స్తంభాలు కూలిపోవడం మొత్తం మీద పూర్తిగానో పాక్షికంగానో మూడున్నర లక్షల ఇళ్ళు ధ్వంసం ……తీరంనుంచి ఇరవై కిలోమీటర్ల వరకూ పొలాల్లో కి ఉప్పునీటి కయ్యల ద్వారా సముద్రం చొరబడి మూడేళ్ళు పంటలేలేకుండా పోయాయి.
కరెంటు స్ధంబాలను నిలబెట్టి వారానికో నెలకో రెండు నెలలకో కరెంటు ఇచ్చారు గాని మొక్కలను నాటించలేదు 1996 తుపాను విద్వంసం తరువాత ఈ జిల్లా మైదాన ప్రాంతాల్లో చెట్లు లేకుండా పోవడం పెద్ద నష్టం
తక్షణ పునరావాసం మొదలవ్వడానికే వారం రోజులు పట్టింది. నష్టాల నమోదు పూర్తవ్వకడానికి నెల పట్టింది.
ఆర్ధిక సహాయాలకోసం ఎక్కడికక్కడ రాజకీయనాయకులు నష్టాలను ఎక్కువగా చూపించి నమోదు చేయించారు. విరుచుకు పడిన బీభత్సం ముందు ఎంత డబ్బిస్తే మాత్రం జీవితాలు కుదుట పడతాయి అనిపించి నష్టాల నమోదులో అతిశయోక్తుల గురించి నాకు తెలిసిన సంఘటనలని కూడా వార్తగా యివ్వలేదు. సహచర రిపోర్టర్లు యిచ్చిన వాటిని వద్దనలేదు.
ఆరునెలల తరువాత శాశ్వత పునరావాస నిర్మాణాలు మొదలయ్యాయి.
ఇంత పెనుతుపాను వచ్చిన నెలలోనే మరో 20 రోజుల తరువాత నవంబరు 26 న మరో తుపాను హెచ్చరిక వచ్చింది. తీరంలో వున్నవారికి ఓపిక లేకపోవడం వల్ల నిండా మునిగిపోయి వున్నందువల్లా ఈ హెచ్చరిక భయపెట్టలేకపోయింది.తీరానికి దూరంగా వున్న వారిని గజగజా వణికించింది. అది 11 రోజులపాటు సముద్రంలోనే నింపాదిగా కదలుతూ డిసెంబరు 6 న మద్రాస్ దగ్గర తీరం దాటింది. ఇంత సుదీర్ఘ కాలం సముద్రంలో సంచరించిన తుఫాన్ బంగాళా ఖాతంలో ఇంకొకటి లేదు.
అప్పటికే విశాఖ వాతావరణ కేంద్రంలో రామకృష్ణ అనే అధికారి పరిచయ మయ్యారు. రోజూ ఫోన్ చేస్తే వివరాలు చెప్పేవారు. మీ వైజాగ్ రిపోర్టర్ ఒకటి చెబితే ఇంకోటి రాస్తున్నారు మీరు కరెక్టు గా ఫాలో అవుతున్నారని మీ ప్రశ్నల్ని బట్టి తెలుస్తుది. రోజూ మీరే ఫోన్ చేయండి మీరే రాయండి అని సూచించారు. నా గుండెల్లో రాయిపడింది. అనుకున్నట్టే ఆరిపోర్టర్ తన రాజ్యంలోకి నేను ఎంటరయిపోయాని ఫిర్యాదు చేశారు. మేనేజర్లు ఎంటరయ్యాక సీన్ మారిపోతుంది. (యూజువల్ గా) వాళ్ళు సూదుల్ని మొయ్యడానికి దూలాలు వెతుక్కుంటారు. ఆదూలాలకు సూదుల్ని గుచ్చి వాటిని విజయవంతంగా మోసేస్తారు. ఈ విషయంలోనూ అదే జరిగింది.
డెస్క్ లో మిత్రులకు తుపాను గురించి నాకు తెలిసిన సమాచారం వివరిస్తున్నపుడు ఉపద్రష్ట కామేశ్వరరావు విశేష ఆసక్తి కనబరచారు. ఒక వ్యాసం రాయమని నాకు సూచించారు. ఆయన దగ్గర వున్న విషయం చూసి మీరే రాయండి అని చిన్న వత్తిడి పెట్టాను. బాగారాశారు.అది ఆయన పేరుతో ఎడిట్ పేజీలో అచ్చయింది. అప్పట్లో ఈనాడు ఇన్ సైడర్ల వ్యాసాలు ప్రచురించేవారు కాదు.
ఈ సైక్లోన్ కవరేజి ఈనాడుకి విశేషమైన గుర్తింపు తెచ్చిన సంఘటనల్లో ముఖ్యమైంది. నాకు కూడా పేరు తెచ్చింది. ఈనాడులోపలా బయటా జర్నలిస్టులు ” నవీన్ కేంటి చెప్పుకోడానికి 96 సైక్లోన్ కవరేజివుంది, పాశర్లపూడి బ్లోఅవుటుంది” అనేవారు
అప్పుడు డెస్క్ లో పిఎస్ఆర్, మల్లిఖార్జునరావు, శర్మ, సారధి, కామేశ్వరరావు, సుబ్రమణ్యం వుండేవారు
విలేకరుల కష్టాల్ని చెప్పడానికి ఇదంతా రాయడం లేదు. కేవలం మానవ ప్రయత్నం తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేని 1996 నాటి పరిస్ధితులను వివరించడానికే ఇదంతా.
ఈ 17 ఏళ్ళలో చాలా మార్పులు వచ్చాయి. కమ్యూనికేషన్లు అద్భుతంగా వికసించాయి. ఇందువల్ల భారీ ప్రాణనష్టం వుండదు. ప్రొక్రయిన్లు ఎర్్తమూవర్లు ఇపుడు అందుబాటులో వున్నాయి. పెనుగాలికి కూలిపోయే చెట్లనయినా, ఇళ్ళనయినా మరే అవరోధాలనైనా నిమిషాల్లో ఎత్తి పక్కన పెట్టే సాధనా సంపత్తులు ఇపుడున్నాయి. అవసరమైతే అధికారులు వీటిని ఎంత సమర్ధంగా వినియోగించుకోగలరన్నదే ప్రశ్న.
రెండు రోజులనుంచీ తీర ప్రాంతాల్లోని జర్నలిస్టు మిత్రులతో ఫోన్ లో మాట్టాడుతున్నాను. 96 తుపాను తరువాత తీరగ్రామాల వారు వలసలుపోవడం పెరిగిందని మత్య్సకారవృత్తిలోకి పిల్లలు రాకపోవడమే ఇందుకు మూలమని మిత్రులు విశ్లేషిస్తున్నారు. దేశమంతటా సాంప్రదాయిక వృత్తులు అంతరించిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పల్లెలు హైదరాబాద్ కు వలసపోతున్నాయి.(సీమాంధ్రలో ప్రస్తుత ఆందోళనకు మూలం ఇదే)
ఇల్లుకూలి,కోడీ మేకా గేదే పోయి, పడవ చితికి, వలచిరిగి, కౌలుభూమి కుళ్ళినపుడు కేవలం రెక్కల కష్టం మీదే బతికే మనిషే తొందరగా తేరుకున్నాడు. తుపాను షెల్టర్లలో సర్కారు ఆహారంకొసం పడిగాపులు పడకుండా ఇంకో పనిచేస్తే జీవితమిచ్చే పట్టణానికి బతుకుదారి పట్టాడు. 1990, 1996 తుపానులను, అనంతర తాత్కాలిక ,శాశ్వత పునరావాసాలను గమనించాక ఇది నాకు అర్ధమైంది. మరి ఇపుడు ఆపరిస్ధితులు వున్నాయా?
ప్రతీ తుపానూ తీరప్రాతాల్లో చాలా కుటుంబాల లక్ష్యాల్నీ గమ్యాల్నీ మార్చేస్తుందని నాకు అర్ధమైంది
ఏమైనా భయం అన్ని వేళలా గొంతుచించుకోదు. ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరినట్టు గుండెల్లో గూడుకట్టుకుని వుంటుంది. ముసురు పట్టినట్టు గుబులు గుబులుగా వుంటుంది. తుపాను అనగానే దిగులు భయపెడుతోంది. నురగలై కవ్వించి పాదాల కింద కితకితలు పెట్టే సముద్ర కెరటం వెయ్యికోరలతో విరుచుకు పడి మనుషుల్ని సమూహాలుగా మింగేసే సన్నివేశపు జ్ఞాపకమే వెన్నులో చలిపుట్టించేలా భయపెడుతూంది.
ఊళ్ళకు ఊళ్ళే మునిగిపోయే విపత్తు ఒంటరితనాన్నే కాదు జన సమ్మర్ధాన్ని కూడా భయపెడుతూంది.